ఎప్పుడైనా మీరేదైనా కష్టపడి తయారు చేసుకున్నది మీ మిత్రులు లేదా తెలిసిన వాళ్లు కాపీ కొట్టి తమదే అని చెప్పి మెప్పు పొందిన సందర్భాలు ఉన్నాయా? అది వస్తువు అయినా కావచ్చు, లేదా ఇంకేదైనా కూడా కావచ్చు. అలాంటి సమయాల్లో “ఛ నేను ఎంత కష్టపడి తయారు చేసుకున్న. వీళ్ళేమో నా దాన్ని కాపీ కొట్టారు. నా శ్రమ మొత్తం వృధా అయ్యింది” అని మీకు కచ్చితంగా అనిపిస్తూ ఉండొచ్చు కదా.

ఒక్కొక్కసారి యాదృచ్చికంగా కూడా మనకు వచ్చిన ఆలోచనలు వేరే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కాపీ అనలేము. కానీ ఏదేమైనా మనం చేయాలనుకున్న పనిని మనకంటే ఒకళ్ళు ముందే చేసి మెప్పు పొందితే ఎక్కడో కొంచెం బాధగా అనిపిస్తుంది. ఆత్మనూన్యతకు గురవుతాం. గౌర్ గోపాల్ దాస్ ఈ విషయం మీద ఒక చిన్న కథ చెప్పారు.

నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒకసారి నా స్నేహితుడు తాను మిస్ అయిన క్లాసెస్ లో చెప్పిన వర్క్ ని పూర్తి చేసుకోవడానికి నా పుస్తకాన్ని అడిగి తీసుకున్నాడు. నేను ఇచ్చాను. అతను నాకు తెలియకుండా నేను రాసిన ఒక ఎస్సే(వ్యాసం) ని తన పుస్తకంలో రాసుకున్నాడు. మా స్కూల్లో జరిగిన ఎస్సే పోటీలలో నా దగ్గర నుంచి తను రాసుకున్న ఎస్సే ని ఉపయోగించాడు. ఆ పోటీలో అతనికి మొదటి బహుమతి వచ్చింది.

ఇదంతా నాకు తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. నన్ను నా స్నేహితుడు మోసం చేశాడు అన్న భావన కలిగింది. ఇదంతా ఒక దొంగతనం లాగా అనిపించింది. ఒకసారి నాతో ఒక పీహెచ్డీ విద్యార్థి తన ప్రొఫెసర్ తన రీసెర్చ్ పేపర్ ని తీసుకొని తనకి తెలియకుండా ఆ ప్రొఫెసర్ పేరు తో పబ్లిష్ చేసుకున్నారు అని చెప్పింది.

కార్పొరేట్ ప్రపంచం లో పనిచేసే ఎంతో మంది ఉద్యోగులు తాము ఎంతో కష్టపడి తయారుచేసిన రిపోర్టులను తమతో పాటు పని చేసే వాళ్ళు తమ సొంత లాభం కోసం దొంగిలించడం లాంటివి అవుతూ ఉంటాయని చెప్పారు. ఎంతోమంది రచయితలు కూడా వేరే వాళ్ల రచనలు అచ్చం తాము రాసిన వాటి లానే ఉన్నాయని, తమ ఐడియాలను దొంగిలించారు అని చెప్తూ ఉంటారు.

నిజం చెప్పాలంటే వృత్తి ఏదైనా ఇలా వేరే వాళ్ళ పని తమ పని లాగా చెప్పుకునే మనుషులు కచ్చితంగా ఉంటారు. కానీ అప్పుడే ఒకటి గుర్తు పెట్టుకోవాలి వాళ్లు మన పనిని దొంగిలించ వచ్చు. మన ఆలోచనలను కాదు. మన ఆలోచనలు ఆ ఎస్సే కంటే, ఆ రీసెర్చ్ పేపర్ కంటే, ఆ రిపోర్ట్ కంటే ఎంతో గొప్పవి.

ఒకసారి ఒక పక్షి ఒక తేనెటీగ ని ” నువ్వు చాలా శ్రమించి, ఎంతో కష్టపడి తేనెపట్టును కట్టుకుంటావు. కానీ మనుషులు వచ్చి నీ తేనెపట్టును తీసుకెళ్ళి పోతారు. నీకు బాధగా అనిపించదా?” అని అడిగింది. దానికి తేనెటీగ ఒక అద్భుతమైన సమాధానం చెప్పింది ” అవును నిజమే. ఆ నిమిషం నాకు బాధగానే అనిపిస్తుంది. కానీ మళ్లీ నాకే అనిపిస్తుంది వాళ్లు తీసుకెళ్ళింది నా తేనెను మాత్రమే. తేనె ను తయారుచేసే కళ ని కాదు”.

అలాగే మనం కూడా గుర్తు పెట్టుకోవాలి.పక్క వాళ్ళు మన నుండి తీసుకునేది మన కళ మాత్రమే. మన ఆలోచనలను, సృజనను కాదు. మన టెక్నిక్ను వారు దొంగిలించ వచ్చు కానీ మన ప్రతిభను కాదు. మనం చేసిన దాన్ని వాళ్ళు అనుకరించగలరు. కానీ మనలాగా ఆలోచించలేరు.

representative image

అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు మీ పని మీద శ్రద్ధ పెట్టి చేయండి. అలాగే కష్టపడి పని చేస్తూ మీ ఆలోచనలను సృజనాత్మకతను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండండి. ఓపికగా, ధైర్యంగా ఉండండి. మంచి ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఇది గౌర్ గోపాల్ దాస్ ఇచ్చిన సందేశం. మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైతే ఇదే విషయం గుర్తుంచుకోండి. వాళ్లు దొంగిలించింది మీ పనిని మాత్రమే ఆలోచనలను కాదు.

Follow Us on FB:


Sharing is Caring: