Ads
కమానీ ట్యూబ్స్ లిమిటెడ్, కమనీ స్టీల్ రీ-రోలింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సాయికృపా షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్, కల్పనా బిల్డర్స్ & డెవలపర్స్, కల్పనా సరోజ్ & అసోసియేట్స్, మరియు KS క్రియేషన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఈ ఆరు కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు కల్పనా సరోజ్.
Video Advertisement
అసలు ఎవరు ఈ కల్పనా సరోజ్ అంటే.. 1958లో మహారాష్ట్ర అకోలా జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు కల్పన . ఏడో తరగతి పూర్తి కాగానే కల్పనా సరోజ్‌కు వివాహం చేసేశారు. ఆమె తన భర్తతో కలిసి థానేలోని ఉల్హాన్స్ నగర్ అనే మురికివాడలోని ఒక చిన్నగదిలో, పదిహేను మంది మధ్యన అడుగు పెట్టారు. అయితే అక్కడి వాతావరణంలో ఇమడలేకపోయిన కల్పనా సరోజ్, తండ్రితో కలిసి తిరిగి పుట్టింటికి వచ్చేశారు.
స్వగ్రామానికి వచ్చిన తరవాత తల్లిదండ్రులను ఒప్పించి ముంబైలో బంధువుల ఇంట్లో ఉంటూ, ఒక బట్టల దుకాణంలో నెలకు అరవై రూపాయల జీతానికి ఉద్యోగంలో చేరారు. బట్టలు కుట్టటం నేర్చుకుని, అదనంగా నెలకు వంద రూపాయలు సంపాదించటం ప్రారంభించారు. అప్పటి నుంచి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, సౌకర్యంగా ఉండే ఇల్లు అద్దెకు తీసుకునే స్థాయికి ఎదిగారు కల్పన.
ఆ తర్వాత జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద 1975లో 50,000 రూపాయల ప్రభుత్వ సహాయం అందింది. ఆ డబ్బుతో క్లాత్ బొటిక్ ప్రారంభించారు. పాత వస్తువుల విక్రయం కూడా ప్రారంభించారు. క్రమశిక్షణ, దీక్ష, పట్టుదలతో… వేసిన ప్రతి అడుగులోను విజయం సాధించి, ‘సుశిక్షిత్ బేరాజ్‌గార్ యువక్ సంఘటన’ ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా సుమారు మూడు వేల మందికి ఉద్యోగాలు లభించాయి.
ఆ తర్వాత 1995లో లిటిగేషన్లో ఉన్న స్థలం కొన్నారు. ‘‘నాకు స్థలాల గురించి తెలియకపోవటంతో మోసపోయాను. కలెక్టర్ సహకారంతో ఆ స్థలాన్ని డెవలప్మెంట్కి ఇవ్వగలిగాను’’ అంటున్న కల్పన సరోజ్, ఆ స్థలంతోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవ్వరూ ఊహించనంత ముందుకు దూసుకుపోయారు. నాలుగుకోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగారు. పది సంవత్సరాలుగా మూతబడిన కమానీ ట్యూబ్స్ కంపెనీకి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి, కంపెనీని లాభాల బాట పట్టించి, రెండు వేల కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగారు.
ఒక బట్టల దుకాణంలో నెలకు అరవై రూపాయల జీతంతో ఒక హెల్పర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన దళిత మహిళ నేడు ఐదు వేల చదరపు అడుగుల ఇంట్లో దర్జాగా నివసిస్తున్నారు. ఇప్పుడు కల్పనా సరోజ్ వయసు ఆరు పదులు దాటింది. ఇప్పుడు హోటల్ రంగంలోకి అడుగు పెడుతున్నారు సరోజ్. ఎన్నో ఇబ్బందులు దాటిన తర్వాత తన రెండో జీవితాన్ని ప్రారంభించి, విజయాలు సాధించి బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకుని పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు కల్పన.
ప్రస్తుత సమాజం లో చిన్న చిన్న సమస్యలకే జీవితాలని ముగించుకొనే యువత ఉన్న తరుణం లో ఈమె జీవితం అందరికి ఆదర్శం కదా..
End of Article