Ads
కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ఆ ప్రదేశం లో తుఫాను వెలిసిన వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రాణాలు కోల్పోయిన విగత జీవులు, అస్త్రాలు, ఆయుధాలు, విరిగిపోయిన రథాలు, రధ చక్రాలు మిగిలి ఉన్నాయి. ఈ తరుణం లో మహానుభావుడైన భీష్ముడు అంపశయ్య పై పడుకుని సూర్యుడు ఉత్తరాయణ కాలమందు ప్రవేశించే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. సరిగ్గా, అదే సమయం లో.. శ్రీ కృష్ణుడు భీష్ముడిని సమీపించాడు. కృష్ణుడిని చూడగానే, భీష్ముడి మోము విప్పారింది. సరైన సమయానికే వచ్చావు కృష్ణా.. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని నీవే తీర్చాలి అంటూ అడిగాడు. ఆ సమయం లో భీష్ముడు శ్రీ కృష్ణుడిని ఏమి ప్రశ్నలు అడిగాడు..? వాటికి శ్రీ కృష్ణుడు ఏమి సమాధానాలిచ్చాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
యుద్ధం వెలిసిన తరువాత.. భీష్ముడు శ్రీ కృష్ణుడిని ఇలా అడిగాడు.. శ్రీ కృష్ణా నీవు ఈశ్వరుడి రూపమే కదా? అంటూ భీష్ముడు ప్రశ్నించాడు. దానికి సమాధానం గా కృష్ణుడు చిరునవ్వుని బదులిచ్చి.. నేను ఈశ్వర రూపమేంటి పితామహా.., నేను అందరివాడిని, నిమిత్తమాత్రుడిని అంటూ సమాధానం చెప్పాడు. నీ లీలలు కట్టిపెట్టు కృష్ణా అంటూ భీష్ముడు పట్టుబట్టినా కృష్ణుడు చిరునవ్వుతోనే సమాధానమిచ్చాడు. మరో ప్రశ్న గా.. ఇప్పుడు జరిగిన ఈ యుద్ధం అంతా ధర్మ ప్రకారమే జరిగిందా..? అంటూ భీష్ముడు ప్రశ్నించాడు. దానికి కూడా, కృష్ణుడు దాటవేయబోతూ ఎవరి వైపు నుంచి పితామహా..,కౌరవుల వైపు నుంచా..? పాండవుల వైపు నుంచా..? అని తిరిగి ప్రశ్నించాడు.
వెంటనే భీష్ముడు ఏమన్నాడంటే.. కౌరవులు అధర్మ పరాయణులు .. వారిని పక్కన పెట్టు. ధర్మం వైపు నిలిచారు కాబట్టే నీవు పాండవుల వెంట ఉండి వారు యుద్ధం గెలిచేలా చేసావు. కానీ ఈ యుద్ధం లో పాండవుల చేతిలో ద్రోణాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు, సైంధవుడు సైతం మరణించారు. ఇదంతా ధర్మ ప్రకారమే జరిగిందా..? ఆయుధాలు లేని సమయం లో అర్జునుడు కర్ణుడిని వధించాడు. ఇదంతా ధర్మమేనా? నీ లీలలు కట్టిపెట్టి..అవసాన దశలో ఉన్న నా సందేహాలు తీర్చు కృష్ణా అంటూ భీష్ముడు వేడుకున్నాడు. దీనికి శ్రీ కృష్ణుడు సమాధానమిచ్చాడు. ఇప్పటివరకు జరిగింది అంతా ధర్మం ప్రకారమే జరిగిందని చెప్పాడు. ఎవరికీ ఏది జరగాలని ఉందొ అది జరిగిందన్నారు. తాను ధర్మం వైపే నిలబడతానని.. మిగిలినది ఎలా జరగాలని ఉంటె అలా జరుగుతుందని శ్రీ కృష్ణుడు వివరించాడు.
దీనితో ఖంగుతిన్న భీష్ముడు.. కృష్ణా నీవేనా ఈ యుద్ధాన్ని ధర్మ ప్రకారం గా జరిగిందని చెబుతున్నావు..? ధర్మ వాక్య పరిపాలకుడైన ఆ రాముని అవతారం ఎత్తిన నీవేనా ఈ మాటలు మాట్లాడుతున్నావు అని భీష్ముడు తిరిగి ప్రశ్నించాడు. దానికి శ్రీ కృష్ణుడు బదులిస్తూ.. యుగానికి తగ్గట్లు..అవతారములు తగ్గట్లు చర్యలుంటాయని తెలిపాడు. రాముడు త్రేతాయుగం లో నాయకుడు గా ఉన్నాడని.. తాను ద్వాపర యుగం లో ఉన్నానని శ్రీ కృష్ణుడు వివరించాడు. మా ఇద్దరి నిర్ణయాలు ఒకలా ఉండవని తెలిపాడు. భీష్ముడు ఈ విషయం పై వివరణ కోరగా.. శ్రీకృష్ణుడు ఈ విధం గా వివరణ ఇచ్చాడు.
రాముని కాలమైన త్రేతాయుగం, ప్రస్తుతం ద్వాపర యుగం రెండు ఒకేలాంటివి కాదని వివరించాడు. రాముడికి రావణుడు శత్రువైనా, రాక్షసుడు అయినప్పటికీ ధర్మ పరాయణుడన్నాడు. పరమ శివుని భక్తుడని కృష్ణుడు వివరించాడు. రావణుడు చెడ్డవాడైనా, అతనికి విభీషణుడు వంటి సోదరుడున్నాడు. అలాగే వాలి వంటి చెడ్డవాడికి కూడా..అంగదుడు వంటి మంచి కుమారుడు ఉన్నాడు. ఆ కాలం లో రాక్షసులు కూడా ధర్మాన్ని రక్షించారు. కానీ., ప్రస్తుతం ధర్మాన్ని రక్షించే వారు తక్కువ అని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు.ఈ యుగం లో జరాసంధుడు, కంసుడు, దుర్యోధునుడు, దుశ్శాసనుడు వంటి పాపులు ఉన్నారని, అందుకే యుగానికి తగ్గట్లు వ్యవహరించానని వివరం చెప్పాడు.
కృష్ణా, భవిష్యత్ తరాల వారు నిన్ను అనుసరిస్తే..అది ధర్మమేనా..? అని భీష్ముడు ప్రశ్నించాడు. దానికి సమాధానం ఇచ్చిన కృష్ణుడు..రాబోయే కాలం ఇంకా ఘోరం గా ఉంటుందని హెచ్చరించాడు. క్రూరులు, దుష్టులు, అనైతిక శక్తులు ధర్మాన్ని నాశనం చేయడానికి సిద్ధం గా ఉంటారన్నారు. రాబోయే కలియుగం లో ధర్మం ఒక్క పాదం పైనే నడుస్తుందని.. ఆ కాలం లో కృష్ణుడి కంటే కఠినం గా వ్యవహరించాల్సి వస్తుందని శ్రీ కృష్ణుడు వివరించాడు. కృష్ణా.. ధర్మం అంతరించి పోతుందా..? అలా జరుగుతుంటే ఈశ్వరుడేమి చేయడా..? అని ప్రశ్నించాడు.
అందుకు వివరణ ఇచ్చిన కృష్ణుడు.. పితామహా.. ఈశ్వరుడు ఏమి చేయడు. మనుషులే చేస్తారు. ఈశ్వరుడు ధర్మం వైపుంటాడు. ఇందాక నన్ను ఈశ్వర రూపమా అని ప్రశ్నించారు. ఇక్కడ జరిగిన యుద్ధం లో.. నేనేమైనా చేసానా? ఎవరినైనా చంపానా? అంతా పాండవులు చేసారు. వాళ్లే చేయాలి. ఇదే విషయాన్ని నేను యుద్ధం మొదటిరోజునే వివరించారు. అదే ధర్మం. అదే పరమ సత్యం. ఎవరికీ ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ధర్మాన్ని కాపాడడమే మానవాళికి ముందున్న లక్ష్యం అని శ్రీకృష్ణుడు భీష్ముడికి హిత బోధ చేస్తాడు.
End of Article