Ads
ఏ పూజ కు అయినా ముందు వినాయకుడిని ఆరాధించడం తప్పనిసరి. అలాంటిది సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు జన్మించిన చవితి రోజున.. ఆయనకు మరింత విశేషం గా పూజలు చేసుకుంటూ ఉంటాం. వినాయక ఉత్సవాలు దేశమంతటా ఘనం గా జరుగుతాయి. నవరాత్రులు ఆ విఘ్నేశ్వరుడిని కీర్తించి.. ఆ తరువాత తొమ్మిదో రోజు రాత్రికి నిమజ్జనం చేస్తారు. ఈ తొమ్మిది రోజులు దేశమంతా విశేషం గా సంబరాలు జరుగుతాయి..
Video Advertisement
ఈ సంబరాల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరు పాల్గొంటూ భజనలు, కీర్తనలు చేస్తుంటారు. సందుకో పందిరి వెలిసినా.. అందరు కలిసి గణేష్ మహారాజ్ ను ప్రార్ధిస్తారు. “గణపతి బప్పా మోరియా” అంటూ కీర్తిస్తారు. అసలు ఈ పదాలకు అర్ధం తెలియకపోయినా చాలా మంది భక్తి తో, ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి మరీ కీర్తిస్తూ ఉంటారు. అసలు ఈ పదాలకు అర్ధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వం చక్రపాణి అనే రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య ఉగ్ర. వీరి గండకీ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవారు. వీరికి పిల్లలు లేని కారణం గా.. చింతిస్తూ ఉంటారు. శానక మహాముని వీరికి సూర్యోపాసన చేయాలనీ సూచిస్తారు. ఆ భార్య భర్తలిద్దరూ అలానే చేయగా.. సూర్యుని అనుగ్రహం తో ఉగ్ర గర్భం దాలుస్తుంది. అయితే.. ఆ బిడ్డ సూర్యుడంతటి శక్తిమంతుడు అవడం తో ఆ వేడిని భరించలేక..ఉగ్ర ఆ గర్భాన్ని సముద్రం లో వదిలేస్తుంది.
అయితే.. సముద్రుడు బ్రాహ్మణ రూపం లో వచ్చి పిల్లవాడిని తీసుకుని తిరిగి ఉగ్ర కు అప్పగిస్తాడు. ఆ పిల్లవాడు తేజోవంతం గా ఉంటాడు. వారు ఆ పిల్లాడికి సింధు అని నామకరణం చేస్తారు. సింధు అనే ఆ పిల్లవాడు పెరిగి, పెద్దయి దాదాపు రెండువేల సంవత్సరాల పాటు సూర్యుడిని ఉపాసిస్తాడు. ఆ తపస్సు వలన అమృతాన్ని పొందుతాడు. ఆ అమృతాన్ని తాగి సింధు అమరుడవుతాడు. మృత్యు భయం లేకపోవడం తో.. సింధు ముల్లోకాలని జయించాలని భావిస్తాడు.
ఆ ఆలోచన రావడంతోనే ఆ సింధురాసురుడు దేవతలందరినీ కారాగారం లో బంధిస్తాడు. ముందు దేవతలను జయించిన సింధు.. ఆ తరువాత కైలాసం, వైకుంఠం పై పడతాడు. ఇతని బాధలు పడలేక పార్వతి పరమేశ్వరులు సైతం మేరుపర్వతం లో ఉంటారు. శ్రీ మహావిష్ణువుని గండకీ రాజ్యం లో ఉండాల్సిందని ఆదేశిస్తాడు. ఈ క్లిష్టకాలం లో దేవగురువు బృహస్పతి దేవతలకు ఓ ఉపాయం చెబుతాడు. సింహారూఢుడు, పది తలలు కలిగిన గణపతిని ఆరాధించమని.. ఆయనే సింధూరాసురుడినుంచి తప్పించగలరని చెబుతాడు.
దేవతలంతా ఆ గణపతిని ప్రార్ధించడం తో ఆయన వారి ప్రార్థనలను ఆలకించి… తాను పార్వతి గర్భాన జన్మించి సింధూరాసురుడిని వధిస్తానని మాట ఇస్తాడు. మరో వైపు మేరు పర్వతం లో పరమేశ్వరుని ఆదేశాల మేరకు పార్వతి దేవి పన్నెండు సంవత్సరాల పాటు గణేష్ మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. ఆమె తపస్సుకి మెచ్చిన గణపతి.. ఇచ్చిన మాట ప్రకారమే ఆమె కడుపున పుడతాడు. అతనికి వారు గణేశుడు అని పేరు పెట్టుకుంటారు.
ఓసారి సింధూరాసురుని మిత్రుడు కమలాసురుడు శివుని పై యుద్ధానికి దండెత్తుతాడు. అప్పుడు గణపతి కమలాసురుడి పైకి దండెత్తి ఘోర యుద్ధం చేస్తాడు. అయితే.. కమలాసురుడి రక్తం నుంచి వేలమంది రాక్షసులు పుట్టుకొచ్చేవారు. దీనితో అతడిని చంపడం కష్టమైంది. ఆ సమయం లో సిద్ధి, బుద్ధి అనే తన పుత్రికలను గణపతి స్మరిస్తాడు. వారు ప్రత్యక్షమై కమలాసురుని నెత్తురు నుంచి పుడుతున్న రాక్షసులను మింగివేస్తుంటారు. వారి సాయం తో గణపతి కమలాసురుడి శిరస్సుని చేధిస్తాడు . ఆ తరువాత సింధూరాసురుడి వద్దకు వెళ్లి దేవతలను విడిపించాలని కోరతాడు.
సింధూరాసురుడు అందుకు ఒప్పుకోకపోవడం తో..గణపతి మూడు రోజుల పాటు ఘోర యుద్ధం చేస్తాడు. చివరకు.. గణపతి సూక్ష్మరూపం లోకి మారిపోయి సింధూరాసురుడి పొట్ట పై బాణం వేస్తాడు. ఆ బాణం వలన సింధూరాసురుడి ఉదరం చీలి అందులోని అమృతం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు సింధూరాసురుడు కూడా మరణిస్తాడు. కమలాసురుడి శిరస్సు మోర్గాం క్షేత్రం లో పడుతుంది. అక్కడే దేవతలంతా కలిసి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేసారు. ఈ విధం గా.. మోర్గాం పుణ్యక్షేత్రమైంది. ఈ యుద్ధాన్ని గణేశుడు నెమలి వాహనం పై చేయడం వలన ఆయనకు మయూరేశ్వర్ అన్న పేరు వచ్చింది.
యుద్ధం చేసిన ప్రాంతం లో నెమళ్ళు ఎక్కువ గా ఉండేవి. మరాఠీ భాషలో నెమళ్లను మోర్ అని పిలుస్తారు. అందుకే ఆ ప్రాంతాన్ని మోర్గాం అని పిలవడం మొదలు పెట్టారు.
అలా గణపతి మోరేశ్వర్ అయ్యారు. అందుకే.. గణపతి బప్పా మోరియా అని పిలుస్తుంటారు. దీని వెనుక ఉన్న ఈ కథను చదివిన వారికి, విన్నవారికి శ్రీ మోరేశ్వర్ స్వామి వారి అనుగ్రహం తప్పకుండ లభిస్తుంది.
End of Article