ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ విఫలం అవడంతో విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పోటీ కూడా ఇవ్వకుండా వెనుదిరగడం పట్ల మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇందులోనూ ప్రత్యేకించి విరాట్ కోహ్లీ వైఫల్యం ఎంతో మంది అభిమానులని అలాగే, టీం ఇండియా మాజీ క్రికెట్ ప్లేయర్ లని కూడా ఆందోళనకు గురి చేసింది.

చివరి 18 ఇన్నింగ్స్‌లో మూడు సార్లు డకౌట్ అయ్యారు విరాట్ కోహ్లీ. మరొక నాలుగు సార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. విరాట్ కోహ్లీ వైఫల్యంపై సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మన్ ఇన్ని సార్లు విఫలమవడం మంచిది కాదని అన్నారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్, ఆడుతున్న తీరు ఆందోళనకు గురి చేశాయని చెప్పారు. ఆఫ్ స్టంప్ మీదకి వచ్చే బాల్స్ ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు అని చెప్పారు. ఆఫ్ స్టంప్ పైకి వచ్చే బంతులని డ్రైవ్ చేయడంలో కూడా విరాట్ కోహ్లీ విఫలం అయ్యారు అని చెప్పారు.

ప్రతిసారి ఇలాగే అవుట్ అవ్వడం ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న బ్యాట్స్‌మన్ కి మంచిది కాదు అని చెప్పారు. ఇలాంటి బ్యాటింగ్ వైఫల్యమే నుండి తొందరగా బయట పడాలి అంటే విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ నుండి సలహా తీసుకోవాలి అని సునీల్ గవాస్కర్ అన్నారు. 2003-04 లో ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా పర్యటన సందర్భంగా సచిన్ టెండూల్కర్ మొదటి రెండు టెస్ట్ లలో విఫలం అయిన సందర్భం గురించి గవాస్కర్ మాట్లాడారు.

మొదటి టెస్ట్ లో 1,37 రెండవ టెస్ట్ లో 0,44 పరుగులు తీసిన సచిన్, తర్వాత మూడవ టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్‌లో డబల్ సెంచరీ చేశారు. 241 పరుగులతో సచిన్ టెండూల్కర్ నాటౌట్ గా నిలిచారు. విరాట్ కోహ్లీ కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు అని, దీని నుండి బయట పడాలి అంటే సచిన్ టెండూల్కర్ నుండి టెక్నిక్ సపోర్ట్ తీసుకోవాలి అని అన్నారు.

అంతే కాకుండా కవర్ డ్రైవ్ జోలికి వెళ్లొద్దు అని సచిన్ టెండూల్కర్ సలహా ఇస్తారు అని అన్నారు. ఏ షాట్ అయితే ఆడడంలో తాను బలహీనంగా ఉన్నారో, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అని అన్నారు. డ్రైవ్ ఆడడంలో విఫలం అవుతున్నాను అని తెలిసి కూడా విరాట్ కోహ్లీ మళ్లీ మళ్లీ డ్రైవ్ ఆడడం సరైన నిర్ణయం కాదు అని, ఆ బలహీనత నుండి విరాట్ కోహ్లీ బయటికి రావాలి అని అన్నారు.