Ads
శ్రీలత కొత్తగా పెళ్లి చేసుకొని కోటి ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టింది. ఉద్యోగరీత్యా వెంటనే హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. మొదట్లో తనకు గాని, ఇంటికి కానీ కావాల్సినవన్నీ భర్తే చూసుకునే వాడు. దీంతో శ్రీలత కూడా అన్నీ భర్తే చూసుకుంటున్నాడు అని సంబరపడిపోయేది.
Video Advertisement
కానీ రాను రాను ఇద్దరికి సంబంధించిన అన్నీ తనే చూసుకోవడం, నిర్ణయాలు తన ప్రమేయం లేకుండా అతనే తీసుకునే వాడు. అదేంటి అని అడిగితే.. నీకు చెప్పేది ఏంటీ అన్నట్టూ నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు. దీంతో అతని నిర్లక్య ధోరణికి, నియంతృత్వ ప్రవర్తనకు ఆమెలో అసంతృప్తి పెరిగిపోయింది.
వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇలాంటి నియంతృత్వ ప్రవర్తనను ఎలా మార్చుకోవాలి, భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారిలా..
#1. ఒకరినిఒకరు అర్థం చేసుకోవాలి:
భార్యాభర్తలు అన్నాక ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి కానీ అంతా నా ఇష్టం, నేను చెప్పిందే చేయాలి, నాకు నచ్చినట్టే ఉండాలి అంటే అది బానిస బతుకు అవుతుంది కానీ భార్యాభర్తల బంధం అవదు.
#2. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించాలి:
ఎదుటివారేం చెబుతున్నారో పూర్తిగా వినాలి, వారి అభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రతి చిన్న విషయంలోనూ నీకేం తెలీదు, నువ్వెందుకు ఎందుకూ పనికి రావు అంటూ కించపరచకూడదు. ఇది ఒకరకంగా భాగస్వామిని కుంగదీస్తుంది. సూటిపోటి మాటలతో మనసు గాయపరచడం వల్ల దాంపత్యబంధం బీటలు వారుతుంది.
#3. నిర్ణయాల్లో భార్యను భాగస్వామిని చేయడం:
ఇంటికి సంబంధించిన అనేక విషయాల్లో తన అభిప్రాయం కూడా అడగాలి. ఉదాహరణకు ఏదైనా కొత్త బైక్ లేదా కార్ అలాంటివి తీసుకునే ముందు తనకు ఓ మాట చెప్పి అభిప్రాయాన్ని అడగడం తను చెప్పిన వాటికి గౌరవం ఇవ్వాలి. అలాగే ఇంటికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తానే సొంతంగా తీసుకునేలా ప్రోత్సహించాలి.
#4. పిల్లలపై చెడు ప్రభావం:
భార్యాభర్తలు పిల్లల ఎదుట గొడవ పడడం వల్ల వారు మానసిక ఒత్తిడికి గురవుతారు. పైగా భార్యకు ఏం తెలీలేదు అన్నట్టూ మాట్లాడడం వల్ల నిజంగా మా అమ్మకు ఏం తెలీదేమో అని భావన పిల్లల్లో ఏర్పడుతుంది. దాంతో వారికి ఏం కావాలి అన్నా నాన్నతోనే పని జరుగుతుంది అనుకుంటారు. అంతేకాదు రేపు మన ఇంట్లోని మగ పిల్లలు కూడా అలానే తయారవుతారు.
#5.వంటింటి సాయం:
భార్య టైం కి వండి పెడితే తినడం కాకుండా సెలవు రోజుల్లో అప్పుడప్పుడు భార్యకు సాయం చేయాలి. కలిసి పనిచేయడం వలన అలుపు తెలీదు. సరదా జోకులు వేసుకుంటూ కలిసి పని చేసుకోవచ్చు.
#6. కలిసి తినడం:
భార్య వడ్డిస్తుంటే భర్త తినడం కంటే కలిసి తినడం వలన ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. నిజానికి భర్త ఒక్కడే తన మానాన తను తినేసి వెళ్తే.. కొన్నిసార్లు ఇంట్లో ఆడవాళ్లు తినకుండానే ఉండిపోతారు. దీంతో వారు అనేక రకాలైన శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
#7. సరదాగా బయటికి వెళ్లడం:
రోజంతా ఇంట్లో ఉండే భార్యల్ని అప్పుడప్పుడు సినిమాలకు, షాపింగ్ లకు తీసుకెళ్లడం వలన వారిలో నూతనోత్సాహం వస్తుంది. అనేక కొత్త విషయాలు నేర్చుకుంటారు. భార్యకు భర్త మీద కూడా సదాభిప్రాయం ఏర్పడుతుంది. ఇలా అనేక జాగ్రత్తలు తీసుకుంటే.. భార్యాభర్తల సంబంధం మున్నాళ్ళ ముచ్చటగా కాకుండా నూరేళ్ళ పంటగా ఉంటుంది.
End of Article