హనుమంతుని తోకకు వేలాడే ఈ గంటను గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఇంత కథ ఉందా?

హనుమంతుని తోకకు వేలాడే ఈ గంటను గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఇంత కథ ఉందా?

by Anudeep

శ్రీ రామచంద్రుని అనన్య భక్తుడు హనుమంతుని గురించి తెలియని హిందువు ఉండడు. ఆయన బలశాలి, ధైర్య శాలి.. ఎంత బలం ఉన్నా ఎప్పుడు, ఎక్కడ, ఏమి మాట్లాడాలో తెలిసిన వాడు. అందుకే శ్రీరాముడు సైతం ఆంజనేయుడిని అభిమానిస్తూ ఉంటాడు. అయితే.. హనుమంతుడి తోకకు గంటను శ్రీరాముడే పెట్టాడు. దీని వెనుక ఓ కథ ఉంది. ఓ సంఘటనకు గుర్తుగా ఈ గంటను పెట్టుకోమని శ్రీరాముడే స్వయంగా ఇస్తాడు.

Video Advertisement

hanuman 1

కథలోకి వెళ్తే, శ్రీ రాముడు వనవాసంలో ఉన్నప్పుడు సీతాదేవి అపహరించబడుతుందన్న సంగతి తెలిసిందే. అయితే.. సీత జాడ కోసం సుగ్రీవుడు, హనుమంతుడు కూడా శ్రీరామునికి సాయం చేస్తారు. అయితే.. హనుమంతుడు వానర సైన్యాన్ని తీసుకొస్తాడు. ఈ సైన్యంలో చాలా చిన్నవిగా సింగిలీక కోతులు కూడా ఉన్నాయి. ఇవి చాలా చిన్నవి. ఇవి ఏ ఆయుధాలను మొయ్యలేవు. ఈ కోతులు గుంపులు గుంపులుగా తమ వేలి గోర్లతోనే యుద్ధం చేస్తాయి. ఇవి చుట్టుముడితే తప్పించుకోవడం కష్టమే. అందుకే హనుమంతుడు వీటి సాయం కూడా తీసుకుంటాడు.

hanuman 3

అందరు సిద్ధం అయ్యి లంకపై యుద్ధానికి బయలుదేరబోతున్న సమయంలో శ్రీ రామచంద్రునికి ఒక్క క్షణం తత్తరపాటు కలుగుతుంది. తన కోసం ఇంతమంది కుటుంబాల్ని వదిలేసి యుద్ధానికి వస్తున్నారని తల్చుకుని బాధపడతాడు. ఆ తరువాత ఆ వానర కుటుంబాలన్నిటికి ప్రమాణం చేస్తాడు. ఎంతమంది సైన్యంతో వెళ్తున్నానో.. అంతమంది సైన్యంతో తిరిగి వస్తానని, అప్పటివరకు ధైర్యంగా ఉండమని చెబుతాడు. వానర సైన్యం శ్రీరాముని మాటలకు సంతసిస్తుంది.

sri rama

చివరకు యుద్ధం ప్రారంభం అవుతుంది. సింగిలీక కోతులు గుంపులు గుంపులుగా వెళ్లి శత్రువులపై దాడి చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో కుంభకర్ణుడు కూడా రంగం లోకి దిగుతాడు. కుంభకర్ణుడిది భారీ శరీరం అన్న సంగతి మనకి తెలిసిందే. కుంభకర్ణుడు రధం కూడా ఆయన సైజుకు తగ్గట్లే ఉంటుంది. ఆ రధంపై ఉన్న గొడుగుకు చిన్న చిన్న గంటలు ఉన్నాయి. అవి చూసేవారికి పెద్ద గంటలుగానే కనిపిస్తాయి. ఒక్కసారిగా కుంభకర్ణుడు వానర సైన్యంపై విరుచుకు పడతాడు.

kumbhakarna

ఆ టైంలోనే కుంభకర్ణుడి కుడి చేయి తగిలి జండాపై ఉన్న గంటలు కింద పడిపోతాయి. ఆ సమయంలో వేయి సింగిలీక కోతుల గుంపుపై ఓ గంట పడుతుంది. ఈ కోతులన్నీ ఆ గంట కింద ఇరుక్కుపోతాయి. ఆ గంటని కదల్చడానికి వాటి బలం సరిపోదు. చేసేదేమి లేక అక్కడే కూర్చుంటాయి. బయట యుద్ధం జరుగుతున్నా.. లోపల చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దం నెలకొంటుంది. ఇంతలో ఓ కోతి మనం చచ్చిపోతామేమో అని మాట్లాడడం మొదలు పెడుతుంది.

singilika

మిగతా కొన్ని కోతులు కూడా మాట్లాడడం మొదలుపెడతాయి. మనల్ని కాపాడడానికి ఎవరైనా వస్తారో లేదో..? అంటూ చర్చించుకుంటూ ఉంటాయి. ఈ చర్చ కాస్తా శ్రీరామునివైపు వెళ్తుంది. అసలు ఈ శ్రీరాముడు ఎవరు..? మన గురించి ఆయనకేమైనా పట్టిందా? ఏదో హనుమంతుడు అడగ్గానే ముందు వెనకా.. ఆలోచించకుండా వచ్చేసాం అంటూ నిందించడం ప్రారంభించాయి. ఆ కోతుల్లోనే.. వయసులో పెద్దదైన ఓ ముసలి కోతి “కారణాలు లేకుండా ఆడిపోసుకోవడం ఎందుకు? ఆ శ్రీరాముడినే స్మరిద్దాం.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..” అంటూ హితవు చెప్పింది.

hanuman 4

ఆ కోతిని చూసి మిగతా కోతులన్నీ నవ్వాయి.. కానీ ఆ కోతి మాత్రం శ్రీరామ నామస్మరణను మానలేదు. కొంతసేపటికి మిగతా కోతులు కూడా ముసలి కోతితో పాటు శ్రీరామ నామాన్ని జపించడం ప్రారంభించాయి. మరో వైపు.. యుద్ధంలో శ్రీరామ చంద్రుడు విజయం సాధించాడు. రావణుడిని ఓడించి యుద్ధంలో గెలుపొందాడు. వానర సైన్యమంతా శ్రీ రామచంద్రుడిని వేనోళ్ళ పొగుడుతోంది. శ్రీరాముడు మాత్రం హనుమంతుడిని పిలుస్తాడు. సైన్యమంతా ఉన్నారో లేదో లెక్క చూడమంటాడు.. ఓ వెయ్యి కోతుల లెక్క తగ్గిందని హనుమంతుడు తెలుపుతాడు. .

singilika

శ్రీరాముడు వెంటనే ఆదేశాలు జారీ చేస్తాడు. వారు ఎక్కడ ఉన్నా వెతికి, కాపాడాలని చెబుతాడు. శ్రీ రాముడే స్వయంగా రంగం లోకి సింగిలీక కోతుల్ని వెతకడం ప్రారంభించాడు. అంతలో ఓ చోట ఒక గంట బోర్లించి ఉండడాన్ని చూసాడు రాముడు. ఆ గంట కిందే ఈ కోతులు ఇరుక్కుపోయాయేమో అనుకుని.. హనుమను పిలుస్తాడు. హనుమంతుడు శ్రీ రాముని అంతరంగాన్ని గ్రహించి తోకతో ఆ గంటను పైకి లేపుతాడు. ఆ గంట కింద రామ నామం జపిస్తున్న సింగిలీక కోతులు కనిపిస్తాయి. ఆ సింగిలీక కోతులకు ఉన్నట్లుండి వెలుతురు పడడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాయి.

hanuman

ఎదురుగా శ్రీ రామ చంద్రుడే కనిపిస్తాడు. తమని కాపాడడం కోసమే వచ్చాడని తెలుసుకొని ఆ కోతులు సంతోషిస్తాయి. ముందుగా.. ఆయన్ను నిందించినందుకు కూడా బాధ పడతాయి. శ్రీరాముని పాదాలపై పడతాయి. అలా వాటి జన్మ ధన్యమైంది. ఆ సమయంలోనే శ్రీరాముడు హనుమ వైపు చూస్తాడు. ఈ సంఘటనకు గుర్తుగా ఆ గంటను అలాగే తోకకు ధరించాలి అని శ్రీ రాముడు హనుమంతుడిని కోరతాడు. అప్పటినుంచి హనుమంతుడు అలా తోకకు గంటను ధరిస్తూ ఉన్నాడన్నమాట.


You may also like