చాలా మంది పసి పిల్లలలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని వెంటనే గుర్తించలేకపోతూ ఉంటాం. వారికి మాటలు రాకపోవడం, వారి బాధని వ్యక్తపరచడానికి వారికి ఏడుపు తప్ప మరొక మార్గం లేకపోవడం కూడా ఓ కారణం. అయితే పసిపిల్లలను చాలా సునిశితంగా అబ్జర్వ్ చేస్తే తప్ప వారిలో ఏ సమస్య ఉన్నా మనకి తెలిసే అవకాశం ఉంటుంది.
అలా పసి పిల్లల్లో ఆలస్యంగా బయటపడే సమస్యల్లో టంగ్-టై ఒకటి. టంగ్-టై (యాంకిలోగ్లోసియా) అనేది నాలుక యొక్క కదలిక పరిధిని పరిమితం చేసే పరిస్థితి. దీనివలన నాలుకని కదల్చడానికి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు.
దీనివలన నాలుక భాగం నోటిలో పైభాగానికి ఆనుకుని ఉండగకుండా.. కింద భాగానికి ఆనుకుని ఉంటుంది. దీనివలన పసి పిల్లలు పాలు తాగడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంత వయసు పెరిగాక ఆహరం తీసుకోవడానికి కూడా అవస్థ పడుతూ ఉంటారు. తోటిపిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఉండలేరు. టంగ్-టై అనేది పిల్లవాడు తినే, మాట్లాడే మరియు మింగడం వంటి వాటిని కూడా ప్రభావితం చేస్తుంది. వీరి బ్రెయిన్ పై కూడా ఈ ప్రభావం చాలానే పడుతుంది.
చాలా వరకు దీనివలన భయపడాల్సిన ఇబ్బందులు కలుగకపోవచ్చు. ఒక చిన్న సర్జరీ ద్వారా కూడా ఈ సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు. టంగ్-టై వల్ల పసిపిల్లలకు నాలుకను ఎగువ దంతాలకి ఎత్తడం లేదా నాలుకను పక్క నుండి పక్కకు తరలించడం కష్టం అయ్యే అవకాశం ఉంటుంది. దిగువ ముందు పళ్లను దాటి నాలుకను బయటకు తీయడంలో ఇబ్బంది ఎదుర్కొంటు ఉంటారు.
బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో మీ పిల్లలు ఇబ్బంది ఎదుర్కొంటున్నా, అన్నం తినేటప్పుడు ఇబ్బందులు వస్తున్న తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే, టంగ్-టై తో ఇబ్బంది పడే పిల్లలు మాటలు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నాలుక సహకరించక పోవడం వలన వీరు ఇతర పిల్లల్లా మాట్లాడలేకపోతారు. ఇటువంటి వారికి స్పీచ్ థెరపీ ఇవ్వడం ద్వారా కూడా వారి పరిస్థితిని మెరుగుదిద్దేలా చేయవచ్చు.