మీరెప్పుడైనా గమనించారా..? కొంత వయసు పైబడ్డ వాళ్ళకి, ఆడవాళ్ళలో.. ముఖ్యంగా గర్భవతుల్లో కాళ్లలో నీరు చేరుతూ ఉంటుంది. ఫలితంగా వీరి కాళ్ళు ఉబ్బినట్లు లావుగా కనిపిస్తూ ఉంటాయి. కాళ్లలో నీరు చేరడం వలన నడవడం కూడా కష్టంగా మారి కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి.
అసలు ఇలా కాళ్లలో నీరు ఎందుకు పడుతోంది..? ఇటువంటి కాళ్ళ నొప్పుల సమస్యలు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వలన కూడా కాళ్ళ వాపులు వస్తూ ఉంటాయి. కాళ్లలో నీరు పట్టడానికి ఇది కూడా ఒక కారణం.
ఇలా కాళ్ళ వాపు రావడాన్ని ఎడిమా అని పిలుస్తారు. ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడం వలన కాళ్ళలో రక్తప్రసరణ ఆగిపోతుంది. అందువల్లే కాళ్ళ వాపు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉప్పు ఎక్కువ తినడం వలన కూడా ఇలా కాళ్ళు వచ్చే అవకాశం ఉంటుందట. తీసుకునే ఆహార పదార్ధాలలో ఉప్పు ఎక్కువ వేసుకోవడం, నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఆ నీరు ఇలా కాళ్ళలోకి చేరుతూ ఉంటుంది.
ఒక్కోసారి గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో కూడా ఇలా ఎక్కువగా కాళ్లల్లో నీళ్లు పడుతూ ఉంటాయి. వృద్ధులలో.. 45 సంవత్సరాలు దాటినా ఆడవాళ్ళలో, గర్భిణిలలో ఈ సమస్యని ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీర్ఘకాలికంగా థైరాయిడ్ సమస్యని ఎదుర్కొంటున్న వారిలో కూడా కాళ్ళ వాపు సమస్యని మనం గమనించవచ్చు. నిరంతరం కాళ్లలో రక్తప్రసరణ జరిగే విధంగా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. గుండె జబ్బులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఇలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాళ్ళ వాపు రాకుండా అరికట్టవచ్చు.