టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో భారత్ దారుణ ఓటమి తర్వాత బీసీసీఐ జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా 30 ఏళ్లు దాటిన ఆటగాళ్లను టీ20లకు పరిగణనలోని తీసుకోవద్దని భావిస్తోందని సమాచారం. ఒకవేళ బీసీసీఐ ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవడం ఖాయం.
టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఓటమి తర్వాత మాజీ క్రికెటర్ గవాస్కర్ కూడా జట్టులో 30 ఏళ్ళు పైబడిన వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటిస్తారని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యం లో తాజా వార్తాహలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటమే టీ20 వరల్డ్ కప్‌లో జట్టు ఓటమికి కారణమని బీసీసీఐ భావిస్తోందని తెలుస్తోంది.
వచ్చే టీ20 వరల్డ్ కప్‌కు మరో రెండేళ్ల సమయం ఉండటంతో.. అప్పటిలోగా జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని బీసీసీఐ భావిస్తోందని తెలుస్తోంది. టీ20 జట్టు నుంచి సీనియర్లను తప్పించి.. యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బోర్డు యోచిస్తోంది. అదే నిజమైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితోపాటు సూర్యకుమార్ యాదవ్‌ను కూడా సెలక్టర్లు టీ20లకు పరిగణనలోకి తీసుకోరు. గత ఏడాదే భారత్ తరఫున టీ20ల్లోకి అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్.. అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో కీలక ఆటగాడిగా ఎదిగిన సూర్య.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే దీనిపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ 30 ఏళ్ల రూల్‌ను అమలు చేస్తే.. వచ్చే వరల్డ్ కప్‌లో రోహిత్, విరాట్, సూర్య, పాండ్య ఆడలేరని ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఫిట్నెస్, నైపుణ్యం ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలే తప్పితే వయసును బట్టి కాదని సలహా ఇస్తున్నారు.