తెలంగాణలో అధికార పార్టీకి వ్యతిరేక గాలి వీస్తోంది. ఎదురే లేదని విర్ర వీగిన గులాబీ నేతలకు అన్ని విషయాలు బూమ్ రాంగ్ అవుతున్నాయి. ఏ ఒక్క హామీ అమలు చేయలేని దుస్థితి అన్ని వర్గాల ప్రజలను దూరం చేస్తోంది. తాజాగా సర్వే సంస్థలు బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు స్పస్టం చేస్తున్నాయి. అణగారిన బహుజన వర్గాల ప్రజల మద్దతు బీఆర్ఎస్ కు దూరమైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ వారికి ఆశాజ్యోతిగా కనిపిస్తోంది. భట్టి పాదయాత్రలో ఇదే స్పష్టం అయింది. ఎన్నికల వేళ దీనిని మరింత బలోపేతం చేసుకొనే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.
మూడో సారి హ్యాట్రిక్ కొడతామంటూ బీఆర్ఎస్ నేతల ఆశలు ఫలించటం సాధ్యం కాదు. క్షేత్ర స్థాయి నివేదికలు ఇవే స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఎన్నో ఆశలతో గెలిపించిన కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం వారి అంచనాలను అందుకోలేకపోయింది. ప్రధానంగా బీసీలు, అణగారిన బహుజన వర్గాల ప్రజలు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వారికి ఆదరణ కరువైంది. నిధులు.. విధులు .. అవకాశాల కల్పనలో ప్రాధాన్యత దక్కటం లేదు. కేబినెట్ నుంచి పంచాయితీ వరకు ఈ వర్గాల పైన నిర్లక్ష్యం…ఉదాసీనత కనిపిస్తున్నాయి. తొమ్మిదేళ్ల కాలంలో కొనసాగుతున్న వివక్ష..అవినీతి బీఆర్ఎస్ పాలకుల పైన తీవ్ర వ్యతిరేకతకు కారణంగా స్పష్టం అవుతోంది.
సెంటిమెంట్ పండిస్తూ..ఆకర్షణీయ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వాటిని అమలు చేయటంలో మాత్రం విఫలమైంది. 2014 – 2018 వరకు తొలి విడత ప్రభుత్వంలో కొన్ని వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకోగలిగిన కేసీఆర్, రెండో విడత ప్రభుత్వంలో మాత్రం వైఫల్యాలు మూటగట్టుకున్నారు. తెలంగాణలో పార్టీల గెలుపు ఓటమలును నిర్దేశించే ప్రధాన ఓటింగ్ వర్గాలు బీఆర్ఎస్ కు పూర్తిగా దూరమయ్యాయి. ఈ సమయంలో బీజేపీ ఏ మాత్రం పోటీలో లేకుండా పోయింది. తొలి నుంచి పేదల పార్టీగా..అణగారిన బహుజన వర్గాలకు అండగా నిలిచే పార్టీగా కాంగ్రెస్ కు ఇప్పుడు తెలంగాణలో ఆదరణ పెరిగింది. తాజాగా మారుతున్న సమీకరణాల్లో ఇదే విషయం స్పష్టం అవుతోంది. నిరుద్యోగులు ప్రభుత్వం పైన రగిలి పోతున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివక్షకు గురవుతన్న వర్గాలు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నాయి. సీఎల్పీ నేత భట్టి నిర్వహించిన పీపుల్స్ మార్చ్ యాత్రలో ఇదే విషయం స్పష్టమైంది. వారి ఆవేదన..వారిలోని బాధకు ఓదార్పు ఇస్తూ వారికి కాంగ్రెస్ అండగా ఉంటుందని భట్టి హామీ ఇచ్చారు. ఇతర నేతల్లా కార్ల హడావుడి.. బౌన్సర్ల హంగామా లేకుండా..నిరాడంబంరగా పేదల మధ్యకు వెళ్లిన భట్టికి ప్రజల మూడ్ స్పష్టంగా అర్థమై, వారికి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ తోనే తామంతా అంటూ ఆ వర్గాలు హామీ ఇచ్చాయి. తాజాగా రాహుల్ గాంధీతో భట్టి సమావేశ సమయంలోనూ ఇవే అంశాలు చర్చించారు. ఫలితంగా ఈ వర్గాల ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. తొలిగా ప్రకటించిన చేయూత స్కీం కూడా పేదలను ఉద్దేశించి ప్రకటించినదే. దీంతో, ఇప్పుడు బీఆర్ఎస్ ను నమ్మి మోసపోయిన వారికి కాంగ్రెస్ దిక్సూచీగా మారుతోంది.