వినాయక్ దామోదర్ సావర్కర్..ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు.. అయితే ఈయన గురించి చాలా కొంతమందికే తెలుసని చెప్పొచ్చు. స్వాతంత్య్ర పోరాటంలో తన ముప్పావు జీవితాన్ని జైల్లో గడిపిన స్వాతంత్య్ర వీరుడు సాహసి వీర్ సావర్కర్.
దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్ బ్రిటిష్ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగృత పరిచారు. 1883 మే 28న నాసిక్ జిల్లా భాగూరు గ్రామంలో దామోదర్ పంత్, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక్ దామోదర్ సావర్కర్.
పుణే పెర్గ్యుసన్ కాలేజీలో బిఎ పూర్తి చేసుకున్న వినాయక్ దామోదర్ సావర్కర్ ‘బార్-ఎట్-లా’ చదువు కోసం 1906లో లండన్ బయలుదేరారు. అప్పటికే సావర్కర్‌కు వివాహమైంది. ఒక కుమారుడు కూడా. తెల్లవారి గడ్డ లండన్ నుంచి విప్లవోద్యమం నడపాలనే అక్కడికి వెళ్లారు. విప్లవ కారులతో కలిసి పని చేశారు. సావర్కర్ ఇంగ్లాండ్‌లో న్యాయవిద్యను ఉపకారవేతనము (స్కాలర్షిప్) తో చదవడానికి ప్రభుత్వం నుంచి సహాయం అందుకున్నాడు .
వీర్ సావర్కర్ ‘గ్రేస్ ఇన్ లా కాలేజీ’లో చేరాడు, ‘ ఇండియా హౌస్ ‘లో వసతి పొందాడు. లండన్‌లో, వీర్ సావర్కర్ తన తోటి భారతీయ విద్యార్థులను ప్రేరేపించి, స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వినాయక్ దామోదర్ సావర్కర్‌కు న్యాయస్థానం అండమాన్ జైలులో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు (50 ఏళ్లు) విధించింది.
జైలులో ఉన్న రోజుల్లో సావర్కర్ తన రచనా వ్యాసాంగాన్ని సాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. కులమత బేధాలు పాటించకుండా సంస్కరించారు. దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా 1923 డిసెంబర్లో సావర్కర్‌ను అండమాన్ నుంచి మహారాష్ట్రలోని ఎరవాడ జైలుకు తరలించారు. సుధీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆంక్షలతో విడుదలైన సావర్కర్ జీవితం ద్వితీయార్థమంతా హిందూ సమాజ సంస్కరణలో సాగిపోయింది.
సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత తీసుకురావడానికి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. హిందూ సమాజం నుంచి కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అంటే మనకు శత్రువులను పెంచుకోవడమేనని గుర్తు చేసేవారు సావర్కర్. అన్యమతం స్వీకరించిన వారిని శుద్ధి ఉద్యమాల ద్వారా తిరిగి హిందూ సమాజంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
1963 వ సంవత్సరంలో సావర్కర్ భార్య యమునా బాయ్ చనిపోయిన తర్వాత 1966 వ సంవత్సరం నుంచి సావర్కర్ ఆహారాన్ని మరియు మందులను తీసుకోవటం త్యజించాడు. తాను ఆత్మార్పణ చేస్తున్నానని చెప్పి చనిపోయేవరకు ఆహారం ముట్టనని ప్రతిజ్ఞ చేసాడు. 26 ఫిబ్రవరి 1966 వ సంవత్సరంలో తీవ్ర అనారోగ్యం కారణంగా ముంబై లోని తన నివాసం లో తుది శ్వాస విడిచారు.
అయితే ఈ మహనీయుని జీవిత కథపై ఒక చిత్రం రాబోతోంది. తాజాగా ఆయన 140వ జయంతి పురస్కరించుకొని ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టీజర్ ను విడుదల చేశారు. . వీర్ సావర్కర్ పాత్రలో రణ్‌దీప్ హుడానటించారు. ఈ మూవీకి డైరక్టర్ కూడా ఆయనే. ఇక తెలుగులో కూడా సావర్కర్ జీవితం లోని కొన్ని ఘట్టాల ఆధారంగా ‘ది ఇండియా హౌస్’ అనే చిత్రం రాబోతోంది. ఇందులో నిఖిల్ ప్రధాన పాత్రలో నటించనున్నారు.