మన దేశంలో ఎక్కువ శాతం మంది ప్రజలు తమ తమ ఇళ్లలో రోటీ/చపాతీలను చేసుకుంటారు. అయితే, ప్రాంతాన్ని బట్టి ఆ రోటీలు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. కొందరు పాన్ మీద వేడి చేస్తే.. మరికొందరు పటకారు సాయంతో నేరుగా మంట మీదనే తయారు చేస్తారు.
ఇలా చేయడం వల్ల రుచిలోనూ, రోటీ కాల్చే విధానంలోనూ తేడా ఉంటుంది. అయితే ఇందులో చపాతీని నూనె వేసి కాలుస్తారు, కానీ రోటీని మాత్రం నూనె లేకుండానే కాలుస్తారు. అయితే నూనె వాడకం కూడా తక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి రోటీలు మేలు చేస్తాయనే అభిప్రాయం ఉండటం తో వీటిని రెట్టింపు సంఖ్యలో లొట్టలేసుకుంటూ తింటుంటారు.
అందుకే చాలా మంది గృహిణులు రొట్టెలను ఇలా నేరుగా మంటపై కాల్చేందుకు ఇష్టపడతారు. అయితే రోటీలను నేరుగా గ్యాస్ మంట పై కాల్చడం వల్ల పలు ప్రమాదాలు ముంచుకొస్తున్నట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఎన్విరాన్‌మెంటర్ సైన్స్ అండ్ టెక్సాలజీ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఓ వ్యాసంలో ఇలాంటి రొట్టెలు కొంత హాని చేస్తాయని తేలింది. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ నుంచి వెలువడే కార్బన్ డైయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ల కారణంగా ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు వెల్లడించారు.
వీటి వలన శ్వాసకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది అని వెల్లడించారు . అలాగే ఫుడ్ స్టాండర్డ్స్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్(FSANZ)లో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పాల్ బ్రెంట్ నివేదిక ప్రకారం , రోటీని మంటపై కాల్చినప్పుడు అది అక్రిలమైడ అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. అంతే కాకుండా సహజ చక్కెర, ప్రోటీన్లు కూడా తగ్గిపోతాయని వెల్లడించారు.
పలు అధ్యయనాల ప్రకారం మాంసం, చేపలు, పౌల్ట్రీ ఇవన్నీ కూడా ఎక్కువ మంటపై వండడం అస్సలు మంచిది కాదు. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే కాస్త సమయం పట్టినా చపాతీలను, రోటీలను కిచెన్ టవల్‌తో నొక్కడం లేదా వత్తడం ద్వారా వాటిని చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.