మన సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉన్నారు. వాళ్లలో బాగా నటించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ గుర్తింపు మాత్రం కొంత మందికి మాత్రమే దక్కుతుంది. మిగిలిన వాళ్లకి కూడా వాళ్ల కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. కానీ కొంచెం టైం పడుతుంది. కొంత మంది నటుల ప్రతిభని మనకంటే ఇతర ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా గుర్తిస్తారు.
అలాంటప్పుడే టాలెంట్ అనేది ఒక వ్యక్తిని ఎంత దూరమైనా తీసుకెళుతుంది అనే మాట రుజువవుతుంది. ఈ విషయంపై కోరా లో ఒక వ్యక్తి ఈ విధంగా అడిగారు “అబ్రాడ్ లో చాలా పాపులర్ అయిన, అలాగే వాళ్ల దేశంలో అంత బాగా తెలియని సెలబ్రిటీ ఎవరు?”. ఈ ప్రశ్నకి అభిషేక్ ఓఝా ఒక సెలబ్రిటీ పేరు చెప్పారు. ఆ సెలబ్రిటీ మరెవరో కాదు మన తెలుగు నటుడు సుబ్బరాజు.
సుబ్బరాజు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. అందులో పోకిరి, ఆర్య, దేశముదురు, నేనింతే, బిల్లా, మిర్చి, దువ్వాడ జగన్నాథం, లీడర్, గీత గోవిందం వంటి సినిమాలు సుబ్బరాజు కి ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంకొక సినిమా కూడా ఈ జాబితాలోకి చేరుతుంది. అదే బాహుబలి ద కంక్లూషన్.
ఈ సినిమా లో కొంచెం కామెడీ, కొంచెం భయం, తర్వాత భయాలలో నుండి బయటికి రావడం, అలాగే కొంచెం సెంటిమెంట్ లాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న కుమార వర్మ పాత్రలో ఎంతో బాగా నటించారు సుబ్బరాజు.
ఆ పాత్ర ద్వారా తెలుగులో గుర్తింపు పొందారు. కానీ ఇక్కడ కంటే ఎక్కువగా వేరే దేశంలో మరింత గుర్తింపు సంపాదించారు. బాహుబలి సినిమా జపాన్ లో కూడా విడుదలైంది. అక్కడ వాళ్లకి సుబ్బరాజు పాత్ర, ఆ పాత్రలో సుబ్బరాజు పర్ఫార్మెన్స్ ఎంతగానో నచ్చింది.
జపాన్ వాళ్లకి కుమార వర్మ పాత్ర ఎంత నచ్చిందంటే, ఆ పాత్ర మీద ఎమోటికాన్స్ డిజైన్ చేశారు. సుబ్బరాజు కి ఎన్నో బహుమతులు ఉత్తరాలు కూడా పంపించారు. దీనిపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ విషయాలని సుబ్బరాజు సోషల్ మీడియా ద్వారా అందరికి తెలిపారు.
అలాగే తనపై ఎంతో అభిమానం చూపిస్తున్నందుకు జపాన్ వాళ్ళకి థాంక్స్ కూడా చెప్పారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా సుబ్బరాజు ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాకి కూడా జపాన్ వాళ్ళు సుబ్బరాజు కి తమ విషెస్ తెలిపారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన నిశ్శబ్దం సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిన సుబ్బరాజు నటనకు మంచి మార్కులు పడ్డాయి.