తెలుగు సినిమాని, కాదు కాదు. భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. అప్పటి వరకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా మందికి అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. కమర్షియల్ సినిమాలు మాత్రమే తీస్తాము అని అనుకునేవారు. కానీ గత కొంత కాలం నుండి తన సినిమాలతో టాలీవుడ్ సత్తాని భారత దేశవ్యాప్తంగా చాటారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత భారత దేశ సినిమా చరిత్రకే గర్వకారణం అయ్యారు. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో నటించాలి అని అనుకోవడం చాలా మంది హీరోలకి ఒక కల. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా చేసినా కూడా, అది వారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
అందుకే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, నటులు రాజమౌళితో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోము అని చెప్తూ ఉంటారు. చిన్న పాత్ర అయినా సరే ఆయన సినిమాలో చేస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ పైన ఫోటోలో ఉన్న అబ్బాయి రాజమౌళితో ఏకంగా మూడు సినిమాలు చేశారు. అందులో ఒక సినిమా తెలుగులో మాత్రమే విడుదల అయితే, ఆ తర్వాత సినిమా మాత్రం టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచింది. ఈ అబ్బాయి ఎవరో ఈపాటికి మీలో చాలా మందికి అర్థం అయిపోయి ఉంటుంది. ప్రభాస్. ప్రభాస్ రాజమౌళితో మొదట ఛత్రపతి, ఆ తర్వాత బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూషన్ సినిమాలు చేశారు. బాహుబలి సినిమాతో భారతదేశంలోనే టాప్ హీరో అయిపోయారు.
ఆ తర్వాత నుండి ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నిటికీ మార్కెట్ కూడా బాగా విస్తరించింది. ఇప్పుడు ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కూడా భాగాలు గానే విడుదల అవుతుంది. గత సంవత్సరం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మరొక సినిమాలో నటిస్తారు. వీటితో పాటు, సలార్ రెండవ భాగంలో కూడా ప్రభాస్ నటిస్తారు.