మనలో చాలా మందికి ఏవో చేయాలని ఎన్నో సాధించాలని చాలా కలలు ఉంటాయి. కానీ కలలు కన్న అందరు వాటిని నిజం చేసుకోలేరు. ముందుగా ఒక వ్యక్తి ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ వ్యక్తిని వెనక్కి లాగేది భయం. ఆ భయానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఓటమి ఇంకొకటి తిరస్కరణ.ఎవరైనా మనల్ని తిరస్కరిస్తే ఏదో కోల్పోయినట్టు నిరాశకు లోనవుతాం. కొంతమందైతే జీవితం మీద ఆశ కూడా కోల్పోతారు. ముఖ్యంగా మన ప్రేమని ఎవరైనా తిరస్కరిస్తే అసలు జీవితమే వృధా అనిపిస్తుంది. ఒకసారి ఈ కథ చదివితే అలాంటి ఆలోచనలు ఎంత తప్పో మీకే అర్థమవుతుంది.
ఒక అతను తనతో పాటు కాలేజీలో చదువుకునే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వేరే బ్రాంచ్ కావడంతో బస్ స్టాప్ లో తనని ఎక్కువగా చూసే వాడు. రోజు మొత్తం తన గురించి ఆలోచించేవాడు. ఒక రోజు ధైర్యం చేసి తన ప్రేమని ఆ అమ్మాయితో చెప్పేసాడు.ఆ అమ్మాయి ఇతనిని ఎన్నో రోజుల నుండి గమనిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అని తనకు ముందుగానే తెలుసు. ఆ అబ్బాయి తో తనకి అతని మీద అలాంటి అభిప్రాయం లేదని చెప్పింది. ఆ అమ్మాయి అంటే అతనికి ఎంత ఇష్టమో అతని స్నేహితులకు చాలా బాగా తెలుసు.
ఈ విషయం తెలుసుకుని అతని స్నేహితులు ఆ అమ్మాయి అతని ప్రేమను తిరస్కరించడంతో అతను ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని భయపడ్డారు. కానీ అతను మాత్రం ఎప్పటిలాగానే వీళ్ళతో చాలా మామూలుగా మాట్లాడాడు.వాళ్ళ స్నేహితులు ఆశ్చర్యమేసి ఆ అమ్మాయి అతని ప్రేమని రిజెక్ట్ చేసింది కదా? బాధగా లేదా? అని అడిగారు. దానికి అతను “ఎందుకు బాధ పడాలి. నేనంటే ఇష్టం లేని వ్యక్తి నాకు దూరం అయింది. తనని చాలా ఇష్టపడే వ్యక్తిని దూరం చేసుకుంది” అని సమాధానం ఇచ్చాడు.
ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటి అంటే ఎవరైనా మనల్ని తిరస్కరిస్తే మనం వాళ్ళకి వద్దు అని అర్థం. మనల్ని వద్దు అన్నారు అంటే మన గురించి వాళ్లు పెద్దగా ఆలోచించడం అని అర్థం. కాబట్టి ప్రేమైనా, కెరియర్, ఉద్యోగం విషయంలో అయినా మనం తిరస్కరణకు గురవుతే దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా, మానసిక బలహీనతకు లోనవ్వకుండా, అవన్నీ మర్చిపోయి ధైర్యంగా ముందుకు సాగాలి.