నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఒక సంఘటన ఇటీవల కలకలం రేపింది. ఆర్టీసీ డ్రైవర్ మీద కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే, విజయవాడ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి కావలి నుండి విజయవాడకి వెళుతుంది.
కావలిలో ట్రంక్ రోడ్ లో ఉన్నప్పుడు ఆర్టీసీ బస్ డ్రైవర్ అయిన రాంసింగ్ తన ముందు ఉన్న బైక్ అడ్డు తొలగించాలి అంటూ హారన్ మోగించారు. దాంతో ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి డ్రైవర్ తో వాదించడం మొదలు పెట్టాడు. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసి వారిని పంపించేశారు.
కానీ బైక్ నడిపిన వ్యక్తి ఈ విషయాన్ని తన మిత్రులకు చెప్పడంతో 14 మంది ఆ ఆర్టీసీ బస్సులు వెంబడించి, పట్టణ శివార్లలో ఉన్న మద్దూరుపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల దగ్గర బస్సుని ఆపారు. డ్రైవర్ ని దుర్భాషలు ఆడి తీవ్రంగా గాయపరిచారు. అక్కడ జరిగిన సంఘటనని బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తన మొబైల్ లో వీడియో తీస్తూ ఉన్నాడు. దాంతో అతని మీద కూడా దాడి చేశారు. అతని మొబైల్ ని ధ్వంసం చేశారు.
ఇదంతా కావలి రూరల్ సీఐకి తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకొని విషయాన్ని తెలుసుకున్నారు. డ్రైవర్ ని కావలిలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ, “ప్రజల మధ్యలో ఉండి విధులు నిర్వహించే ఆర్టీసీ కార్మికుల పట్ల ఇలా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము” అని చెప్పారు. అంతే కాకుండా కావలి రూరల్ పోలీసులు దాడి చేసిన వారిపై సెక్షన్ 217/23 u/s 143, 341, 332, 307, 323, 427, IPC, Dt.26.10.23 లో కేసు నమోదు చేశారు.
నిందితుల కోసం గాలిస్తున్నట్టు కావలి పోలీసులు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ దాడిని ఖండిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డ్రైవర్ పై దాడి చేసిన నిందితుల మీద ఇప్పటికే పలు నేరాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి అని పోలీసులు చెప్పారు. అంతే కాకుండా ఈ నిందితులు ఎంతటి వారు అయినా సరే, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని, లేదంటే ఆందోళన చేస్తాము అని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు తెలిపారు.
watch video :
ALSO READ : నిజంగా ఇలాంటి తండ్రులు ఉంటారా…!