మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన సినిమా సీతా రామం. ఈ సినిమా డైరెక్ట్ తెలుగు సినిమా అయినా కూడా తమిళ్, మలయాళం భాషల్లో డబ్ అయ్యింది. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇందులో రష్మిక మందన్న, నటుడు సుమంత్ కుమార్, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, సచిన్ ఖేడేకర్ ఇంకా ఎంతో మంది నటులు ముఖ్య పాత్రలు పోషించారు.
సినిమా ఒక ప్రేమకథగా రూపొందింది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా హిందీలో కూడా డబ్ అయ్యింది. అక్కడ కూడా హిట్ అయ్యింది. మంచి సినిమాని ఎక్కడైనా ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలిచింది.
యుద్ధ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి పాటలు కూడా ఒక హైలైట్ అయ్యాయి. అయితే ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా బృందానికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే డైరెక్టర్ హను రాఘవపూడి మళ్లీ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తో సినిమా రూపొందించబోతున్నారు. సీతా రామం సినిమాని నిర్మించిన వైజయంతి మూవీస్ సంస్థ ఈ సినిమాని కూడా నిర్మిస్తారు. ఈ విషయంపై మాత్రం ప్రస్తుతం చాలా కామెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం ఈ సినిమా కూడా ప్రేమకథగా రూపొందడమే. ఒక రకంగా చూస్తే సీతా రామం సినిమా కథ కొత్తగా ఏమీ లేదు.
ఇలాంటి కాన్సెప్ట్ మీద వచ్చిన కథలు అంతకుముందు చూశాం. కానీ చూపించిన విధానం బాగుండడంతో, అది కూడా ఇలాంటి ప్రేమకథ వచ్చి చాలా సంవత్సరాలు అవ్వడంతో ఈ సినిమా హిట్ అయ్యింది. సినిమా అంత బాగున్నా కూడా ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ కూడా బాగానే వచ్చాయి. సినిమా చాలా స్లోగా ఉంది అని, అందరికీ నచ్చే అవకాశం లేదేమో అని అన్నారు. అది కూడా కొంత వరకూ నిజమేనేమో అనిపిస్తుంది.
ఎందుకంటే సినిమా బాగున్నా కూడా చాలా చోట్ల స్లో గా ఉంటుంది. కానీ ప్రేమ కథ ఇలాగే ఉంటుంది కాబట్టి హిట్ అయ్యింది. ఇప్పుడు కూడా మళ్లీ అదే హీరో హీరోయిన్లు, అదే డైరెక్టర్ అదే జానర్ లో సినిమా అనేటప్పటికి చాలా మంది, “ఒక్కసారి అంటే పర్వాలేదులే కానీ, మళ్లీ రెండో సారి కూడా ప్రేమకథ తీయడం అవసరమా?” అని అంటున్నారు. కొంత మంది ఇలా అంటూ ఉంటే, మరి కొంతమంది మాత్రం, “ప్రేమకథ అయితే ఏమైంది? అలా కాకుండా ఈసారి కొత్తగా తీస్తారు ఏమో చూద్దాం” అని అంటున్నారు. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.