మన దేశంలో రాగికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. ఒకప్పుడు ఎక్కువగా రాగి పాత్రలను వాడేవారు. మంచినీటిని కూడా రాగి బిందె లేదా రాగి గ్లాసుల్లోనే తాగే వారు. అలా సహజసిద్ధంగా శరీరానికి కాపర్ లభించేది. కాలక్రమంలో రాగి వాడకం తగ్గిపోయింది.
ఒకప్పుడు రాగిని కడియాలలాగా, ఉంగరాల లాగ ధరించేవారు. కాలక్రమంలో ఈ సంప్రదాయం కూడా మరుగున పడిపోయింది. ఇటీవల కాలంలో తిరిగి రాగి వాటర్ బాటిల్స్ లాంటివి అక్కడక్కడా కనిపిస్తున్నాయి.
అయితే ఇలా రాగి వాటర్ బాటిల్స్ ను ఉపయోగించడం ఒకరకంగా ఆరోగ్యానికి మంచిదే. ఈ సంగతి అలా ఉంచితే.. ఒకప్పుడు రాగి ఉంగరాలు, కడియాలు ధరించేవారు. అలా ఎందుకు ధరించేవారు.. అలా ధరించడం వల్ల ఏమి జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భారత దేశం ఉష్ణ దేశం. అంటే.. ఇక్కడ చాలా ప్రాంతాలలో వేడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రాంతాలలో రాగి తో చేసిన ఆభరణాలు అంటే ఉంగరాలు, కడియాలు లాంటివి ధరించడం వలన శరీరానికి మేలు జరుగుతుంది. సూర్య కిరణాల కారణంగా ఏర్పడే శరీర రుగ్మతలను అడ్డుకోవడంలో రాగి కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
అందుకే మీరు ఎప్పుడైనా గమనించారా..? రాగి ఉంగరాలు, కడియాలు త్వరగా నల్లబడిపోతూ ఉంటాయి. అయితే వాటిని తిరిగి శుభ్రపరిచి ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటిని ధరించడం వలన కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని విశ్వసిస్తారు. శరీరంలోని విషపదార్ధాలను కూడా రాగి తొలగిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది.
ఇక వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా కొందరు రాగి ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన గ్రహాలు అనుకూలిస్తాయని విశ్వసిస్తారు. తమ జాతకం బాగుంటుందని నమ్ముతుంటారు. వాస్తు దోషాలు తొలగి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని విశ్వసిస్తారు. చాల కాలం క్రితమే మరుగున పడ్డ ఈ ఫ్యాషన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. చాలామంది ఈ రాగి ఉంగరాలు, కడియాలు, బ్రేస్ లెట్స్ ను ధరించాలని ఆసక్తి కనబరుస్తున్నారు.