తెలంగాణ కాంగ్రెస్ లో హైకమాండ్ లెక్కలు మారుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. తెలంగాణలో సామాజిక – ప్రాంతీయ సమీకరణాలకు పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇస్తుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ వరుస తప్పులతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా నిర్ణయాలు అన్నీ ఢిల్లీ నుంచే జరుగుతున్నాయి. ఇప్పుడు అనూహ్యంగా కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటికి హైకమాండ్ ప్రాధాన్యత పెంచింది. కీలకమైన ప్రచార కమిటీ కో-చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. కేసీఆర్ లోటుపాట్లు తెలియటంతో పాటుగా ఆర్థికంగా కీలకమైన సామాజిక వర్గానికి చెందిన పొంగులేటికి వ్యూహాత్మకంగా పెంచుతున్న ప్రాధాన్యతతో రేవంత్ సమస్యలు సృష్టిస్తున్న వేళచెక్ పెడుతున్నట్లు కనిపిస్తుంది.

‘రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టకూడదు – ఎలాగైనా అధికారంలోకి రావాలి’ ఇదీ కాంగ్రెస్ హైకమాండ్ లక్ష్యం. దీని కోసం నేరుగా పార్టీ వ్యవహారాలను హైకమాండ్ పర్యవేక్షిస్తుంది. వ్యూహాలను రచిస్తుంది. ఎంపిక చేసిన నేతలకు బాధ్యత ఇస్తుంది. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు..నేతల వ్యవహార శైలి పైన నిఘా పెట్టింది. అందులో భాగంగా సమర్ధత కలిగిన నేతలకు ప్రాధాన్యత పెంచుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను టీపీసీసీ ప్రచార కమిటీని కాంగ్రెస్ నాయకత్వం ఆచి తూచి ఎంపిక చేసింది. ఈ కమిటీలో మాజీ ఎంపీ, ఖమ్మంలో కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చోటు దక్కింది. పార్టీ మారిన తర్వాత స్పీడ్ పెంచిన పొంగులేటి.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
తెలంగాణలో బీజేపీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో పలు జిల్లాల్లొ గెలుపు ఓటమలును నిర్దేశించే స్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే రేవంత్ కు పగ్గాలు అప్పగించినా, పార్టీ సీనియర్లతో వ్యవహరించిన తీరు, అవసరానికి మించిన దూకుడు…వివాదాస్పద తీరుతో పార్టీకి ఎన్నికల సమయంలో నష్టంగా మారుతుందని హైకమాండ్ గ్రహించింది. దీంతో, రెడ్డి సామాజిక వర్గంలో పట్టు ఉండటంతో పాటుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా హైకమాండ్ పొంగులేటిని గుర్తించింది. కేసీఆర్ పైన తిరుగుబాటు జెండా ఎగుర వేసిన పొంగులేటి వ్యతిరేకులను కూడగట్టటంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ లోని అందరి నేతలతో పొంగులేటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఇప్పుడు కీలక పదవి ద్వారా బీఆర్ఎస్ వ్యతిరేక..కాంగ్రెస్ అనుకూల ప్రచార బాధ్యతలను అప్పగించింది. రాజకీయ వ్యూహాల్లో పొంగులేటికి ఉన్న అనుభవం పార్టీకి కలిసి వస్తుందని పార్టీ భావిస్తుంది. ఢిల్లీ స్థాయిలోనూ పొంగులేటికి వ్యాపార – రాజకీయ పరంగా ఉన్న సత్సంబంధాలు కలిసి వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి తీరుతామని పొంగులేటి ధీమాగా చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు అదే నమ్మకం కలిగించారు. అన్ని రకాలుగా బలమైన నేతగా పొంగులేటిని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. అటు ఢిల్లీ నుంచి ఇటు గల్లి వరకు పొంగులేటికి పెరుగుతున్న ఆదరణ, ప్రాధాన్యత పరోక్షంగా రేవంత్ కు అలర్ట్ టైంగా మారుతోంది. గతంలో టీపీసీసీ చీఫ్ ప్రతీ నిర్ణయంలోనూ కీలకంగా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి టీ కాంగ్రెస్ లో కనిపించటం లేదు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ మూడ్ స్పష్టంగా ఉందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని అన్వేషణ కోసం 2008లో చంద్రయాన్-1 ను ప్రయోగించింది. ఇది మూన్ పై నీరు ఉందని రుజువు చేసింది. ఆ తరువాత చంద్రుని పై ల్యాండింగ్, అన్వేషణ కోసం చంద్రయాన్-2 అంతరిక్ష నౌకను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి, 2019లో ప్రయోగించారు. కానీ సాంకేతిక లోపం వల్ల చంద్రయాన్-2ను మోసుకెళ్లిన ల్యాండర్ ల్యాండింగ్‌లో ఫెయిల్ అయ్యి చంద్రుడి పై కూలిపోయింది. ఈసారి సాంకేతిక లోపం తలెత్తకుండా చంద్రయాన్ 3ని ఇస్రో సిద్ధం చేసింది.
శాస్త్రవేత్తలు గతంలో మాదిరిగా జరగాకుండా ఉండేందుకు చాలా టెస్ట్ రన్లు నిర్వహించారు. చంద్రయాన్-3 మిషన్ 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్. అంటే ప్రొపల్షన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఉండే రోవర్ ల్యాండర్ ను చంద్రుని పై 100కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్తుంది. చంద్రుని కక్ష్య నుండి చంద్రున్ని, భూమిని, అధ్యయనం చేయడం కోసం ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒక పరికరాన్ని అమర్చారు. చంద్రుని ఉపరితలం నివాస యోగ్యమో, లేదో తేల్చడం కోసం, చంద్రుని పై జరిగే మార్పులకు చెందిన ముఖ్యమైన సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది.
ఇప్పటి వరకు చాలా దేశాలు చంద్రుని ఉత్తర ధ్రువం పై ఎన్నో పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం ఇప్పటిదాకా చంద్రుని పై ఎవరు అడుగుపెట్టని దక్షిణ దిశను చేరాలనే ప్రయత్నిస్తోంది. అక్కడ భారత జెండాను పెట్టనున్నారు. చంద్రయాన్–1 నుంచి చంద్రయాన్–3 వరకు దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ఇస్రో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు ప్రాంతంలో చంద్రయాన్–3 ల్యాండర్‌ను దించనున్నారు. యావత్ ప్రపంచం చంద్రయాన్ 3 కోసం ఎదురుచూస్తోంది.





హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్, సట్లేజ్, రావి లాంటి నదులు ప్రమాదకర స్థాయిని ధాటి ప్రవహిస్తున్నాయి. దాంతో ఆ నదుల పై నిర్మించిన రిజర్వాయర్లల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. ఆ రిజర్వాయర్ల గేట్లన్నింటినీ అధికారులు ఎత్తివేశారు. వాటి ప్రభావం వల్ల బియాస్, సట్లేజ్, రావి తీరప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. అక్కడ నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
లక్ష మందికి పైగా ప్రజలను ఇప్పటివరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ప్రవాహంతో పలు పట్టణాలు కూడా సగం వరకు మునిగాయి. బిలాస్పూర్, కాంగ్రా, సోలన్, సిర్మౌర్, సిమ్లా, ఉనా, మండి, హమీర్పూర్, కుల్లు-మనాలి, చంబా, కిన్నౌర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురావడంతో కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే ఆయా జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది.
వర్షాలు ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తాయని, అందువల్ల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఐఎండీ సూచించింది. భారీ వర్షాల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. ఈ 3 రోజులలో భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 72 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. నాలుగు వేల కోట్లు విలువ చేసే ఆస్తి నష్టం జరిగినట్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ డిపార్ట్మెంట్ తెలిపింది.
అలోక్ మౌర్య, జ్యోతి మౌర్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ తరహ ఘటన యూపీలోని కాన్పూరులో చోటు చేసుకుంది. కాన్పూరులో నివసించే అర్జున్ సింగ్, సవిత మౌర్యలు భార్యాభర్తలు. ఈ జంటకి 2017లో పెళ్లి జరిగింది. భార్యకు చదువు పట్ల ఉన్న ఇష్టాన్ని గుర్తించిన అర్జున్ సింగ్, సవిత మౌర్యను అప్పులు చేసి మరి నర్సింగ్ చదివించాడు.
నర్సింగ్ పూర్తి అయిన తరువాత సవిత మౌర్యకు మెడికల్ డిపార్ట్మెంట్ లోనే గవర్నమెంట్ కాంట్రాక్టు జాబ్ వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరిన రెండు మూడు నెలల తరువాత సవిత మౌర్య ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. ఇక అప్పటి నుండి భర్త అర్జున్ సింగ్ ను దూరం పెట్టడం ప్రారంభించింది. ఆమె మరో గదిలో నిద్రపోతుండడంతో అర్జున్ సింగ్ భార్యను నిలదీశాడు. దాంతో సవిత భర్తను నల్లగా, పొట్టిగా ఉన్నవంటూ, నీలాంటి భర్తతో ఉండలేనని చెప్పడంతో అర్జున్ షాక్ అయ్యాడు.
సవిత అర్జున్ సింగ్ నుండి విడాకులు కావాలని దరఖాస్తు చేసింది. కానీ అర్జున్ సింగ్ మాత్రం తనకు భార్య సవిత కావాలని పోరాడుతున్నారు. భార్య చదువుకు 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని, అప్పును కూలీ పనులు చేసుకుంటూ తీరుస్తున్నానని కన్నీరు పెట్టుకున్నాడు. తనకు న్యాయం కావాలని అర్జున్ సింగ్ వేడుకుంటున్నాడు.
రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్తూ, ‘ఈ సంవత్సరం లోపం లేకుండా పూజలు అందుకుని, సంతోషంగా ఉన్నాను. కొంచెం ఆలస్యం అయినా వర్షాలు పడతాయని, అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, భయపడవద్దని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 5 వారాల పాటు ముత్తైదులందరూ నన్ను భక్తిశ్రద్ధలతో పూజించుకోవాలి. నా దగ్గరికి వచ్చిన వారిని క్షేమంగా చుసుకునే భారం నాది. అయిదు వారాల పాటు సాక పోయండి. టెంకాయలను కొట్టి, నైవేద్యాలను సమర్పించాలి.
గతేడాది నాకు మాటిచ్చి ఎందుకు మరిచిపోయారు. మీకు కావాల్సిన బలాన్ని ఇచ్చాను. మీతోనే ఉంటాను. ఏది బయట పెట్టాలో ఏది బయటపెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. అన్నిటినీ కడుపులో దాచుకుంటాను’ అని స్వర్ణలత పేర్కొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగం కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యవాణి వినడం కోసం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. రంగం కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
బోనాల వేడుకలో భాగంగా ఉజ్జయిని మహంకాళి గుడికి లక్షలాది మంది భక్తులు వచ్చారని, రాత్రీ సమయంలో కూడా దర్శనాలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అనేక పార్టీల నాయకులు ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారని వెల్లడించారు. భవిష్యవాణిలో అమ్మవారు బోనాలు వేడుక బాగా జరిగిందని చెప్పడం ఆనందకరం అని తెలిపారు. రంగం భవిష్యవాణి నేపథ్యంలో ఆలయంలో భక్తులకు మహంకాళి అమ్మవారి దర్శనం నిలిపివేశారు.