రోజురోజుకీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మండిపోతున్నాయి. వెయ్యి రూపాయల పైమాటే అన్నట్లు గ్యాస్ సిలిండర్ ధర కొండెక్కి కూర్చుంటుంది. మధ్యతరగతి ప్రజలకు అయితే అందని ద్రాక్ష పండులా తయారైంది ఈ గ్యాస్ ధర.
సామాన్య ప్రజల కష్టాలు గట్టెక్కినట్లు ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ తో సోలార్ స్టవ్ త్వరలో ప్రజల ముందుకు వచ్చేస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు ఈ బుధవారం సోలార్ స్టవ్ ను ఆవిష్కరించారు. సోలార్ స్టవ్ అంటే ఎండలో ఉంచి వంట చేయవలసివస్తుంది అని అనుకుంటున్నారా. ఇంటిలో ఇది ఏ ప్రదేశంలోనైనా పెట్టుకుని వంట చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి విద్యుత్ సరఫరా గాని, గ్యాస్ గాని అవసరం లేదు. మనం 12 నెలలు గ్యాస్ సిలిండర్ కి ఖర్చు పెట్టే ఖర్చుతో ఈ సోలార్ స్టవ్ ను కొనుగోలు చేయవచ్చు.
చమురు శాఖమంత్రి హర్దీప్ సింగ్ పురి అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ సోలార్ స్టవ్ పైన ఆహారాన్ని వండి చూపించారు. ఈ స్టవ్ ఇంటి పైకప్పున అమర్చబడిన సౌరప్యానల్ నుంచి సౌరశక్తిని గ్రహించి కేబుల్ ద్వారా స్టవ్ కి చేరవేస్తుంది. స్టవ్ కి అమర్చబడిన హీటింగ్ ఎలిమెంట్ వల్ల ఉష్ణోగ్రత పెరిగి వంట చేసుకోవచ్చు. స్టవ్‌లో అమర్చబడిన థర్మల్ బ్యాటరీ వలన సోలార్ ఎనర్జీ బ్యాటరీ లో స్టోర్ అయ్యి రాత్రి పూట కూడా వంట చేసుకోవచ్చు అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ S.S.V రామకుమార్ వెల్లడించారు.
అదేవిధంగా రెండు మూడు నెలల్లో వాణిజ్య తయారీ ప్రారంభిస్తామని రామకుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ స్టవ్ ఖరీదు 15 వేల నుంచి 30 వేల మధ్యలో ఉంటుందని వెల్లడించారు. అయితే ప్రభుత్వంవారి రాయితీతో సామాన్య ప్రజలకు అందుబాటులో 10,000 నుంచి 12,000 లో లభిస్తుందని తెలియజేశారు.
దాదాపు 12 సిలిండర్లకు అయ్యే ఖర్చు ఈ ఒక్క స్టవ్ కి పెడితే చాలు. కంపెనీ చెప్పినదాని ప్రకారం నలుగురు వ్యక్తులకు మూడుసార్లుగా ఈ స్టవ్ మీద ఆహారాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఈ స్టవ్ కావాలి అని కోరుకునేవారు ఇంకొన్ని నెలలు వెయిట్ చేయవలసిందే.. ఇంతకీ ఈ స్టవ్ పేరు ఏంటో తెలుసా సూర్యా న్యూటన్..