స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువయ్యాక టెక్నాలజీ అందరికి చేరువయ్యింది. స్మార్ట్ ఫోన్ల సాయంతో టెక్నాలజీ ద్వారా వచ్చే సదుపాయాలను సామాన్యులు కూడా పొందగలుగుతున్నారు. అయితే సదుపాయాలతో పాటు ఈ టెక్నాలజీ మితిమీరిన వాడకం వలన కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి.
నిత్యం ఆన్ లైన్ లోనే ఉండడం వలన మన ప్రైవసీ దెబ్బ తింటుంది. వాట్సాప్ చాట్ లు, మెసెంజర్లు వచ్చాక నిత్యం మనం చాట్ చేసే మాటలు శాశ్వతంగా ఉండిపోతాయి. మాట నోరు దాటితేనే ఊరంతా చేరుతుంది.
అలాంటిది రాతపూర్వకంగా కనిపిస్తూ ఉంటె .. అది తీసుకొచ్చే అనర్ధాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి అనర్ధాల్లోనే కాల్ రికార్డింగ్ కూడా ఒకటి. మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే అవతలి వ్యక్తి మనకి తెలియకుండానే మన మాటలను రికార్డు చేసే అవకాశం ఉంది. మనం సరిగా మాట్లాడకపోయి ఉంటె ఆ మాటలను పట్టుకుని మనలని ఇబ్బందుల్లో పడే అవకాశమూ లేకపోలేదు.
అయితే.. ఓ చిన్న ట్రిక్ తో అవతలి వ్యక్తి మీ మాటలను రికార్డు చేసారో లేదో మీరు తెలుసుకోవచ్చు. మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు, లేదా మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు వారు ఆండ్రాయిడ్ ఫీచర్ సాయంతో మీ కాల్ ను రికార్డు చేస్తున్నట్లైతే మీకు ఓ బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది. కాల్ మాట్లాడుతున్న సమయంలో ఈ సౌండ్ వస్తోందంటే.. అవతలి వారు మీ కాల్ రికార్డు చేస్తున్నారని అర్ధం. అలాగే కాల్ లిఫ్ట్ చేయగానే బీప్ సౌండ్ వచ్చినా కూడా వారు మీ కాల్ రికార్డు చేస్తున్నారని అర్ధం. ఇలా చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉండడం వలన మీకు బీప్ సౌండ్ వస్తుంది. ఇలా మీ కాల్ రికార్డు అవుతోందని తెలిసినప్పుడు జాగ్రత్తపడండి.