ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ స్థాపించి, ప్రజలకి సహాయం చేయడానికి తనవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తనకి 2019 లో వచ్చిన ఒక లెటర్ ని షేర్ చేసుకున్నారు.
ఈ లెటర్ లో ఈ విధంగా రాసి ఉంది. “పవనన్నా, అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. అందరికి ఒకటే చెప్తున్నాం. మేము అవినీతి డబ్బుతో ఓట్లు కొనలేదు, మందు పొయ్యలేదు. గుండాయిజం చెయ్యలేదు అని. నువ్వు చేసిన దిశానిర్ధేశంతో నువ్వు నిలబెట్టిన అభ్యర్థులని ప్రచారం చేసాం.”
“నువ్వు పెట్టిన పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాం.. వారి డబ్బు, మందు, దాదాగిరీ మీద మనం ఓడిపోయి ఉండొచ్చు కానీ ఇది ఇలా కొనసాగనివ్వమని మాకు తెలుసు. మా మొదటి అడుగు పడింది. ఇంకో 5 సంవత్సరాలలో ఇది 100 అడుగులకి చేరుస్తానున్న ఆత్మవిశ్వాసం మాకు ఉంది. కోల్పోయినంత మాత్రాన నిరాశ చెందం. మన పార్టీని ఇంకా బలపరుస్తాం… ఈ ఓటమి కసిని నరనరాల్లో జీర్ణించుకుని 2024 కి ఎగిసే కెరటమల్లే సిద్ధమవుతాం.. కోల్పోయిన దానిని తెచ్చుకునే వరకు విశ్రమించం.”
“గెలుపోటముల్లో నీవెంటే ఉన్నాం. ఉంటాం కూడా… నిజాయితీని చూసి అవినీతి ఎంతో కాలం నవ్వదు. నువ్వు ఓడిపోయావ్ అన్న భాదకన్నా నిన్ను గెలిపించుకోలేక పోయాం అని ఆవేదనని దిగమింగుకుని మన పార్టీకి కావల్సినవి likelu, sharelu కాదని తెలుసుకున్నాం.. వదిలేది లేదు అన్నా… మమ్మల్ని నడిపించు.. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్పించు.. మా జీవితంలో ఏం మారినా సరే, మేము పట్టుకున్న జెండా ఎప్పటికీ మారదు. కట్టెకాలే వరకు నీ తోనే ఉంటాం. రెట్టించిన విశ్వాసంతో.. నీ జనసైనికులు” అని ఆ లెటర్ లో రాశారు.
ఈ లెటర్ ని షేర్ చేసిన పవన్ కళ్యాణ్ దాని గురించి చెబుతూ, “ఇది 2019 లో నేను ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత రాసిన ఉత్తరం. ఇలాంటి జన సైనికుల మద్దతు వల్లే నేను కఠినమైన పరిస్థితుల్లో కూడా ముందుకి నడుస్తున్నాను. మీరందరూ ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు. ఈ లెటర్ రాసిన వ్యక్తి ఇక్కడితో ఆగలేదు. యూఎస్ నుండి వచ్చి, స్థానిక ఎన్నికల్లో ఒక అభ్యర్థిని నిలబెట్టి ఆచంట నియోజకవర్గం రామన్నపాలెంలో ఎంపీటీసీ స్థానంలో గెలిచి 144 ఓట్ల మెజారిటీతో గెలుపొంది విజయం సాధించాడు. మనమందరం భౌతికంగా ఒకళ్ళ నుండి ఒకళ్ళం దూరం ఉన్నా కూడా మన హృదయాలు అన్ని ఒకటే న్యాయం కోసం కొట్టుకుంటాయి” అని పవన్ కళ్యాణ్ రాశారు.