తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజల వద్ద ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.
క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. జనవరి 6 వరకు ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆ తర్వాత కూడా దరఖాస్తులను మండల కేంద్రాల్లో ఇవ్వొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా పాలన దరఖాస్తుల గడువుపై సంచలన ప్రకటన చేశారు. ప్రజా పాలన దరఖాస్తులు సమర్పించేందుకు జనవరి 6నే చివరి రోజంటూ పేర్కొన్నారు. జనవరి 6 వరకే గ్రామాల్లో శిబిరాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మళ్ళీ గడువు పొడిగింపు ఉండదంటూ పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. అయితే జనవరి ఆరు తర్వాత మండల కేంద్రాల్లో దరఖాస్తులను సమర్పించవచ్చు అని అన్నారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ కెసిఆర్ ప్రభుత్వంలో ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసన్నారు. కేసీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారంటూ ఫైర్ అయ్యారు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామని, కేసీఆర్ ను రక్షించేందుకే బీజేపీ సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తుందన్నారు.
ఆటో డ్రైవర్లు బిఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దంటూ పొన్నం ప్రభాకర్ కోరారు. ఓలా, ఉబర్, ర్యాపిడో, మెట్రో ఇతరత్రా అన్ని వచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడే వచ్చిందా? అని ప్రశ్నించారు.అయినా వారి సమస్యలను పరిష్కరిస్తామంటూ పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకిస్తున్నారా? మద్దతిస్తున్నారా అనేది బిఆర్ఎస్ స్పష్టం చేయాలన్నారు. ఆటో డ్రైవర్లతో చర్చలకు తాము సిద్ధమంటూ పేర్కొన్నారు.