ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం భారత ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు.లీగ్ దశ నుండి కూడా అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరుకున్న భారతజట్టు.. ఆఖరి మెట్టుపై బోల్తాపడటం వారిని కలచివేస్తోంది. అయితే మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఔటైన తీరుపై సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
రోహిత్ శర్మ క్యాచ్‌ను ట్రావిస్ హెడ్ నేలపాలు చేశాడని.. అతను నాటౌట్ అంటూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ విషయమై ఐసీసీ స్పష్టత ఇచ్చింది.టీమిండియా మంచి దూకుడు మీదున్న సమయంలో రోహిత్ శర్మ ఔటయ్యాడు.
అరభం నుండి రోహిత్ హిట్టింగ్ ఆడడం మొదలుపెట్టాడు.మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు యత్నించిన హిట్ మ్యాన్.. ట్రావిస్ హెడ్ చేతికి చిక్కాడు. 30 యార్డ్స్ సర్కిల్లో నుంచి వెనక్కి పరిగెడుతూ హెడ్ అందుకున్న క్యాచ్..మ్యాచ్‌నే మలుపు తిప్పింది. అక్కడి నుంచి పరుగులు చేయడానికి టీమిండియా బ్యాట్స్ మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో టీమిండియా భారీస్కోరు చేయలేకపోయింది. 240 పరుగుల వద్ద కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించిన ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్ ఎగరేసుకుపోయింది.
అయితే రోహిత్ శర్మ క్యాచ్‌ను ట్రావిస్ హెడ్ సరిగ్గా పట్టలేదని, క్యాచ్ పట్టే సమయంలో బంతి నేలకు తాకిందని.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సహా సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. క్యాచ్ మిస్ అయినప్పటికీ అంపైర్ రోహిత్‌ను ఔట్‌గా ప్రకటించాడంటూ వాదనలు వచ్చాయి.అయితే ఈ వాదనలకు తెరదించుతూ క్యాచ్ పట్టిన రియల్ ఫుటేజీని ఐసీసీ విడుదల చేసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను షేర్ చేసింది. అందులో రోహిత్ శర్మ క్యాచ్‌ను హెడ్ సరిగానే పట్టినట్లు స్పష్టమవుతోంది. మ్యాచ్ సమయంలోనూ క్యాచ్ రీప్లేను చాలా సార్లు ప్రసారం చేశారు. అయితే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ వీడియోను తప్పుగా చూపించారు.