ఆమె ఒక చంటి బిడ్డకి తల్లి, ఒక దేశానికి ప్రధాని.. తన బిడ్డకి ఆపద వస్తే ఎలా తల్లడిల్లిపోతుందో ఇప్పుడు తన దేశం కూడా కరోనా కోరల్లో ఉంది.. దేశాన్ని కాపాడడం కోసం తన శాయశక్తులా పోరాడుతుంది.. నేనున్నాను అంటూ భరోసా ఇస్తుంది. తనే జెసిండా ఆర్డర్న్..న్యూజిలాండ్ ప్రధాని .. పోయినేడాది చంటిబిడ్డతో ఐక్యరాజ్యసమితిలో అడుగుపెట్టిన ఆమె..ఇప్పుడు అదే చంటిబిడ్డ ఆలనాపాలన చూస్తూ అమ్మగా దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
ప్రపంచం మొత్తం రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతూ, మరణాలు పెరిగిపోతూ వణికిపోతుంటే న్యూజిలాండ్‌లో మాత్రం కరోనా పాజిటివ్ సంఖ్య, మరణాల సంఖ్య తక్కువే..దానికి కారణం జెసిండా అమలు చేస్తున్న నిర్ణయాలే. ఫిబ్రవరి 28 న తొలికేసు నమోదైంది నూజిలాండ్లో..ఇరాన్ నుండి వచ్చిన మహిళగా గుర్తించారు.అ రోజు నుండి విదేశాల నుండి వచ్చినవారిని క్వారంటైన్ కి తరలించాలని, అంతకుకొన్ని రోజుల ముందు విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారికి,వారు నేరుగా కలిసిన వారికి పరీక్షలు జరపాలని ఆదేశాలిచ్చారు జెసిండా. ఒక్కసారిగా యావత్ యంత్రాంగం సిద్దమైంది.
కరోనా కేసులు పెరుగుతుండడంతో పద్నాలుగు రోజుల పాటు ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలని చెప్పారు, జెసిండా మాట తూచా తప్పకుండా పాటించారు న్యూజిలాండ్ దేశస్తులు . కరోనా కట్టడి కాకపోవడంతో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని గుర్తిస్తూ, వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రత్యేక క్లస్టర్లుగా మార్చి మరింత పటిష్టమైన ప్రణాలికలు అమలు చేస్తున్నారు.
లాక్ డౌన్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చేశారు.అత్యవసర వస్తువులతో పాటు, పిల్లల మనసు అర్దం చేసుకుని కామిక్ పుస్తకాలు, కథలు పుస్తకాలు, పిల్లల మేధస్సు పెంచే పుస్తకాలు అందుబాటులో ఉండేలా చేసారు..ఎంతైనా తల్లి కదా.. ప్రజలు కూడా ప్రభుత్వాలకు పూర్తి సహకారం అందించారు.
ప్రస్తుతం అయిదు వారాల కఠిన లాక్ డౌన్ తర్వాత కరోనా వైరస్ ను ఖతం చేయాలన్న తన లక్ష్యాన్ని న్యూజిల్యాండ్ సాధించింది. కరోనా మహమ్మారి నుంచి దాదాపుగా బయటపడింది. గడిచిన కొన్ని రోజులుగా ఆ దేశంలో సింగిల్ డిజిట్ లో కరోనా కేసులు నమోదవగా,సోమవారం ఒకే ఒక్క కొత్త కరోనా కేసు నమోదైంది. లాక్ డౌన్ ఆంక్షలను లెవల్ 4స్థాయినుంచి లెవల్ 3స్థాయికి తీసుకెళ్లింది న్యూజిల్యాండ్. దీంతో లక్షలాది మంది తిరిగి విధుల్లో చేరిపోయారు.
75 శాతం ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు ఒక్కరోజులోనే ఊపందుకున్నాయి. అగ్రరాజ్యాలు సైతం కరోనాను కట్టడిచేసేందుకు ముప్పుతిప్పలు పడుతుంటే కఠినమైన నిర్ణయాలతో ముందస్తు జాగ్రత్తతో కివి దేశం కరోనాను కట్టడి చేయడం ప్రపంచ దేశాలన్నిటిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రపంచదేశాలన్ని ఆ చిన్న దేశమును చూసి కరోనాను ఎలా కట్టడి చేయాలో ఓ పాఠం నేర్చుకోవాలి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.