కొంత మందిని చూస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. నిజానికి అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే మన జీవితం కూడా ఎంతో బాగుంటుంది. హేమలతా లవణం కూడా ఎంతో మందికి ఆదర్శం. అయితే ఇంతకీ హేమలతా లవణం ఎవరు..? ఆమె చేసింది ఏమిటి..? ఆమె గొప్పతనం ఏమిటి ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.
హేమలత గుర్రం జాషువా కుమార్తె. సామాజిక సేవకురాలిగా ఈమె ప్రసిద్ధి చెందారు. హేమలత గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు.
కలం చెప్పిన కథ, మా నాన్నగారు, జీవన సాగరం, అనుభవ తరంగాలు, నేరస్తుల సంస్కరణ, తాయెత్తు – గమ్మత్తు, మృత్యోర్మా అమృతంగమయ వంటి రచనలు కూడా చేశారు. ఈమె చేసిన సేవ ఎంతో. దానికి ఫలితంగా కృషికి, రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ని ఇచ్చారు. అలానే తానా ఎచ్చీవ్మెంట్, వరల్డ్ ఎచ్చీవ్మెంట్ అవార్డులను కూడా ఈమె పొందారు.
1960 లో ఈమెకు లవణం గారితో వివాహం అయ్యింది. ఆ తరవాత వీరిద్దరిని చంబల్ లోయకి రమ్మని ఆచార్య వినోబాభావే ఆహ్వానించడం జరిగింది. అప్పుడు అక్కడ బందిపోట్ల లొంగుబాటు జరుగుతోంది. ఆ సమయంలో ఈ దంపతులను సాక్ష్యులుగా ఉండమన్నారట వినోబాభావే.
అప్పుడు పెద్ద సంఖ్యలో బందిపోట్లు లొంగిపోయారు. పైగా మాన్ సింగ్ అనే ఓ దొంగ హేమలతా గారి చేతికి రాఖీ కట్టారట. ఇలా చంబల్ లోయలో పర్యటించి మానసిక పరివర్తన బందిపోటు దొంగల్లో తెచ్చారు. దొంగలు ఇలా మారుతున్నారని స్టూవర్టుపురం లో కూడా అలా చెయ్యాలని అనుకోవడానికి ఇదే చారిత్రక నేపథ్యం.
చంబల్ లోయ లో జరిగిన ఈ మార్పు హేమలత గారి పైన తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘటనే స్టూవర్టుపురం లో కూడా నేరసంస్కరణలను అమలు చేయడానికి ప్రేరణ ఇచ్చింది. స్టూవర్టుపురం లో నేరస్తులు లేకుండా చేసారు. అంతే కాక ముప్పై మందికి పైగా జోగినులకి వివాహాలు చేశారట హేమలత. అండాశయపు క్యాన్సర్ వ్యాధి తో హేమలత మార్చి 20, 2008 న మరణించారు.