ఏపీ లో టికెట్ ధరల విషయమై కొన్ని రోజులుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల.. ధరల పట్టికకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఏ థియేటర్లలో ఎటువంటి చార్జీలు వసూలు చేయాలి అన్న పట్టికను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ చర్చ మొదలైన తొలినాళ్లలో టాలీవుడ్ లో ఎవరు స్పందించలేదు. తాజాగా.. ఈ పట్టిక విడుదల అయిన తరువాత… టాలీవుడ్ నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు కూడా ఈ విషయమై మాట్లాడారు.
ఆన్లైన్ టికెటింగ్ విధానం వల్ల దోపిడీ ఆగుతుంది అని అనడం సరికాదని దర్శకేంద్రుడు పేర్కొన్నారు. మంచి సినిమా అయితే ప్రేక్షకుడు 300 లు అయినా, 500 లు అయినా చూస్తారని, నచ్చని సినిమాను రూపాయికి కూడా చూడరని చెప్పుకొచ్చారు. ఎంత ధర అనుకుంటే.. అంత పెట్టుకునేలా ఉండాలని.. ప్రేక్షకులు కూడా వచ్చి చూస్తారని.. అడ్డగోలు ధరలు పెడితే అది ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతుంది అనే విషయాన్నీ మర్చిపోకూడదన్నారు.