తెలుగు సినీ ప్రేక్షకులకు కైకాల సత్యనారాయణ సుపరిచితమైన పేరు. కొన్ని పాత్రలకు ఆయన మాత్రమే సరిపోతారు. ఆ పాత్రలలో ఆయనని తప్ప ఎవరిని ఉహించుకోలేము అన్నంతగా ఒదిగి నటిస్తారు కైకాల సత్యనారాయణ. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు.
ప్రస్తుతం 88 సంవత్సరాల వయసుకు చేరుకున్న కైకాల సత్యనారాయణ తన సినీ కెరీర్ లో ఎన్నో మలుపులు చూసారు. ఎన్నో విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించి, అభిమానం చూరగొన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ నుంచి.. జూనియర్ ఎన్టీఆర్ తరం వరకు ఆయన తన నటన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఎస్వీ రంగారావు నటవారసుడిగా కైకాల సత్యనారాయణ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆరుదశాబ్దాల కాలం పాటు పరిశ్రమలో కొనసాగి దాదాపు 777 సినిమాలలో నటించారు. ఒకటేమిటి.. పౌరాణికం, జానపదం, సాంస్కృతికం, చారిత్రకం.. ఇలా ఏ జోన్ లో అయినా నటించగల సత్తా కైకాల సత్యనారాయణది.
ఆయన కృష్ణా జిల్లా బంటుమిల్లిలో 1935 జులై 25 న జన్మించారు. 1958 లో సిపాయి కూతురు సినిమాతో తెలుగు సినిమా రంగప్రవేశం చేసారు. మొదట్లో ఆయన ఎన్టీఆర్ కు డూప్ గా కూడా చేసారు. ఆ తరువాత సీనియర్ ఎన్టీఆర్ చొరవ చూపించడంతో ఆయనకు ఇతర సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి. లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్ధం, నర్తనశాల, శ్రీ కృష్ణా పాండవీయం, కురుక్షేత్రం, దానవీర శూరకర్ణ, సీతాకళ్యాణం ఇలా చాలా పౌరాణిక సినిమాలలో నటించారు.
యముడికి మొగుడు, యమగోల, యమలీల వంటి సినిమాలలో యముడి పాత్ర పోషించి యముడిని తలపించారు. ఇప్పటికి యముడి పాత్ర అంటే మొదట కైకాల సత్యనారాయణ రూపమే గుర్తొస్తుంది. దాదాపు నాలుగుతారల నటులతో నటించిన కైకాల సత్యనారాయణకు 2011 లో రఘుపతి వెంకయ్య పురస్కారం లభించింది. ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కైకాల సత్యనారాయణ చివరిగా “దీర్ఘాయుష్మాన్ భవ” అనే సినిమాలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.