అమ్మ అయ్యే క్షణం కోసం పెళ్లి అయిన తరువాత అమ్మాయిలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. పిల్లలని కనడం, పెంచడం శక్తికి మించిన పనే అని తెలిసినా మాతృత్వం కోసం ఎదురు చూడని అమ్మాయి ఉండదు. అయితే ప్రస్తుతం పరిగెడుతున్న బ్రతుకులను దృష్టిలో ఉంచుకున్న అమ్మాయిలు పిల్లలను కనడం అనే వరాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేయడం మానేసి.. దానిని కూడా ఓ పనిలా, ప్రోగ్రాం లా భావిస్తూ టైం సెట్ చేసుకుంటున్నారు.
అమ్మతనం అనేది ఏ అమ్మాయికైనా వరం లాంటిదే. అయితే.. ఏ వయసులో అమ్మ అవ్వాలి అన్న విషయమే పెద్ద చర్చగా మారుతోంది. లైఫ్ లో సెటిల్ అవ్వడం కోసం పిల్లలు కనడాన్ని పోస్ట్ పోన్ చేసే అమ్మాయిలు లేటు వయసులో తల్లులు అవుతున్నారు.
ప్రతి ఫీల్డ్ లోను కాంపిటీషన్ ఉంటుంది. కెరీర్ లోనే కాదు.. పిల్లలను కని వారిని వయసుకు తగ్గట్లు పెంచడం లో కూడా కాంపిటీషన్ లో ఉంది. లేటు వయసులో పిల్లలను కనడం వలన వారు వయసుకు వచ్చేసరికి మన వయసు ఎక్కువై వారి బాదేతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతాం. అందుకే పిల్లలకు మనకు మధ్య వయోభేదం ఎక్కువగా లేకుండా చూసుకుంటే భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.
ఈ విషయమై మాట్లాడిన గైనకాలజిస్టు డాక్టర్ నందినీ పాల్షేత్కర్ ఏ అమ్మాయి అయినా 25 ఏళ్ల వయసు నుంచి 35 ఏళ్ల వయసులోపు తల్లి కావడానికి ఉత్తమమైన వయసని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు పెళ్లిళ్లనే ఆలస్యంగా చేసుకోవడం వలన పిల్లలను కూడా ఆలస్యంగా కంటున్నారు. అయితే మహిళల్లో ముప్పయ్యేళ్ల వయసు దాటిన తరువాత సంతాన సంబంధిత సమస్యలను ఎదుర్కునే వారు ఎక్కువగా ఉంటున్నారని నాగ్‌పుర్‌కు చెందిన గైనకాలజిస్టు డాక్టర్ చైతన్య శెబేకర్ తెలిపారు. 32 ఏళ్ల వయసు దాటాక వీరిలో విడుదల అయ్యే అండాల సంఖ్య తగ్గిపోతుంది.
దీనితో సంతానం కలగడంలో ఇబ్బందులు వస్తుంటాయి. సాధారణంగా గర్భం దాల్చినపుడు రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తుంటాయని.. అందుకే మరీ చిన్న వయసులోనూ.. అలా అని వయసు ఎక్కువ అయ్యాక అయినా ఇబ్బందులు తప్పవని.. అందుకే గర్భం దాల్చే ఆలోచన ఉన్న వారు సరైన సమయంలోనే ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. పాతిక నుంచి ముప్పయ్యేళ్ల లోపే వయసు ఎందుకు ముఖ్యమంటే ఆ వయసులోనే అమ్మాయిలలో అండాలు ఎక్కువ గా ఉంటాయి.
వారికి పదిలక్షల అండాలు ఉంటాయి. రజస్వల అయ్యే సమయానికి వారికి మూడు లక్షల అండాలు మాత్రమే ఉంటాయి. ఆ తరువాత అండాల సంఖ్య పెరిగి.. వారికి ముప్పయేళ్లు దాటేసరికి కేవలం పాతిక వేల అండాలు మాత్రమే మిగులుతాయి. ఇక యాభై ఏళ్ళు వచ్చేసరికి కేవలం వెయ్యి అండాలు మాత్రమే మిగులుతాయి. పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. కాని స్త్రీలలో అంత ఎక్కువగా ఉత్పత్తి ఉండదు. వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అందుకే అనువైన వయసులో మాత్రమే ప్రెగ్నన్సీని ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.