Disclaimer: ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కల్పితం మాత్రమే. ఎవరిని ఉద్దేశించినది కాదు.
ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే ఒక మనిషికి ఇంకొక మనిషి మాత్రమే సహాయపడగలరు అని అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో పక్కనే ఉన్న మనిషిని నమ్మడం ఎంత ప్రమాదకరమో ఈ కథ చదివితే మీకే అర్థమవుతుంది.
షాలిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. షాలిని ఇంకా తన తల్లిదండ్రులు, చెల్లి హైదరాబాద్ లో ఉండేవారు. తర్వాత కుటుంబం అంతా పూణే లో స్థిరపడ్డారు. ఉద్యోగం చేస్తున్నా కూడా షాలిని కి ఐఏఎస్ అధికారి అవ్వాలనే లక్ష్యం ఉంది. దాంతో ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరొక పక్క సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతోంది.
షాలిని కి తన కొలీగ్ సాకేత్ మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఇద్దరూ కలిసి పని చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా అప్పుడప్పుడు వర్క్ ఎక్కువగా ఉంటే షాలిని వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. సాకేత్ షాలిని కలిసి పని చేసేవారు. అలా సాకేత్ షాలిని తో పాటు షాలిని వాళ్ళ కుటుంబానికి కూడా దగ్గరయ్యాడు. అన్న తమ్ముళ్లు లేని షాలిని, సాకేత్ ని ఒక అన్న లాగా భావించేది.
లాక్ డౌన్ తర్వాత ఆఫీస్ కి తిరిగి మొదలైంది. కానీ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడంతో షాలిని బాగా ఇబ్బంది పడింది. ఒకరోజు సాకేత్ షాలిని ని ఆఫీస్ కి ఎలా వెళ్తున్నావు అని అడిగాడు. తను అదే ఇబ్బంది పడుతున్నాను అని చెప్పింది షాలిని. దాంతో సాకేత్ తను కార్ లోనే ఆఫీస్ కి వస్తున్నాను అని, తనతో పాటు ఆఫీస్ కి వెళ్లొచ్చు అని, అలాగే ఇద్దరిదీ ఒకటే టైమింగ్ కావడంతో, ఇంట్లో కూడా తనే దింపేస్తాను అని చెప్పాడు. షాలిని కూడా అందుకు సరే ఉంది. దాంతో ఇద్దరూ రోజు సాకేత్ కార్ లో ఆఫీస్ కి వెళ్లేవారు. షాలిని ని సాకేత్ ఇంటి దగ్గర దింపే వాడు.
ఒకరోజు ఇద్దరు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నారు. ఆ రోజు వర్షం బాగా పడుతుండడంతో ఆరు గంటలకే చీకటి అయిపోయింది. ఆ రోజు సాకేత్ ప్రవర్తన షాలిని కి కొంచెం కొత్తగా అనిపించింది. అంతలోపే సాకేత్ షాలిని తో తనకి షాలిని అంటే చాలా ఇష్టం అని చెప్పి, షాలిని పై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు.
షాలిని అరుపులు బయటికి వినిపించకుండా విండో గ్లాసెస్ క్లోజ్ చేసి, కార్ డోర్స్ లాక్ వేశాడు. దారిలో వెళ్తున్న ఒక జంట షాలిని అరుపులు విని, కార్ అద్దం పగలగొట్టడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన సాకేత్ షాలిని ని బయటికి తోసేసి, ఆ జంటలో ఉన్న మహిళపై కారుతో దాడి చేసి వెళ్ళిపోయాడు. దాంతో ఆ మహిళ ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత సాకేత్ పై షాలిని కుటుంబం కేసు పెట్టారు.
ఈ ఘటన నుండి షాలిని ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. కానీ ఏదేమైనా తను ఐఏఎస్ అధికారి అయ్యి ఆడపిల్లలు అందరికీ రక్షణ కల్పించాలి అని నిర్ణయించుకుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతోంది. షాలిని మాత్రమే కాదు ఇలా ఎంతోమంది కొంతమందిని పూర్తిగా నమ్మేస్తారు. కాబట్టి ఎంత పరిచయం ఉన్నా కూడా అలా ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు, వాళ్లు స్నేహితులైనా సరే లేదా బంధువులైనా సరే. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది అనేది ఈ కథ యొక్క సారాంశం.