ఆ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. చివరి వరకు ఒకరినొకరు తోడు ఉండాలనుకున్నారు.. పెద్దలకు నచ్చకపోయినా వారిద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు. సమయం కథనం ప్రకారం అతని పేరు పెద్దపంగ ప్రణయ్.. వ్యవసాయ శాఖలో ఏఈవో. ఆమె పేరు లావణ్య (21) వెటర్నరీ కోర్సుని పూర్తి చేసింది. ఇద్దరు ప్రేమలో మునిగితేలారు. పెద్దలను ఒప్పించుకున్నారు. మొదట ఒప్పుకోకపోయినా, తరువాత ఇద్దరికీ పెళ్లి చేసారు. గత సంవత్సరం జూన్ 12న వీరిద్దరికి పెళ్లి జరిగింది. ప్రేమ పెళ్లి అయినా కూడా, లావణ్య కుటుంబ సభ్యులు మొత్తం ముప్పై లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమిని, కొంత నగదు ను కట్నం కింద ఇచ్చారు.

అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైం లో, ప్రణయ్ కుటుంబ సభ్యులు మరింత కట్నం తేవాలి అంటూ లావణ్య ను వేధించడం మొదలు పెట్టారు. పెళ్లి అయిన కొంత కాలానికే కాపురం లో కలతలు మొదలయ్యాయి. అయితే, గొడవలు ఎక్కువ గా జరుగుతున్నాయని, ప్రణయ్ లావణ్య ను ఆమె ఇంటిదగ్గర దింపి వెళ్ళాడు. ఇంటికి వచ్చాక కూడా లావణ్య స్థిమితం గా ఉండలేకపోయింది. బాధను భరించలేక పురుగులు మందు తాగేసింది. చావుకు దగ్గరవుతున్న సమయం లో తన భర్త గుర్తుకురావడం తో.. ఫోన్ చేసింది. మాటలు తేడా గా ఉండడం తో.. ఏమి జరిగింది అని ప్రణయ్ అడగగా..”నన్నెందుకు వదిలేసావ్.. పురుగుల మందు తాగేసా” అని మగత గా చెప్పింది. ఈ ఆడియో కూడా వైరల్ అయ్యింది. అయితే అంతలోనే ఆమె మృతి చెందింది.

లావణ్య మరణానికి అత్తింటి వేధింపులే కారణం అంటూ.. లావణ్య తల్లితండ్రులు నిరసన కు దిగారు. ఓ వైపు ఆందోళన జరుగుతుండగానే, ప్రణయ్ ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. “అమ్మానాన్న క్షమించండి.. నేను లావణ్య వద్దకు వెళ్తున్నా.. నా భార్య చావుకు కారణమైన వాళ్ళని శిక్షించండి.. చావైనా , బతుకైనా నీతోనే లావణ్యా..” అంటూ సూసైడ్ నోట్ రాసాడు. ఈ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.















