సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ పార్టీ సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల్లో భారీగా మార్పులు చేస్తోంది. దాంతో కర్ణాటక బీజేపీ సీనియర్ నేత అయిన శ్రీరాములు సోదరి, బళ్ళారి మాజీ ఎంపీ జె శాంత పార్టీలో చేరారు.
మంగళవారం నాడు తాడేపల్లి ముఖ్యమంత్రి జగన్ పార్టీ కండువా కప్పి శాంతని ఆహ్వానించారు. 2009 లో బీజేపీ తరపున కర్ణాటక జిల్లాలోని బళ్లారి నుండి శాంత ఎంపీగా పోటీ చేసి గెలిచారు. జగన్ చేస్తున్న అభివృద్ధి చూసి తాను పార్టీలో చేరాను అని, ఈ పార్టీ కోసం సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తానని శాంత అన్నారు. శాంతా వాల్మీకి వర్గానికి చెందినవారు.
జగన్ పాలనలో వాల్మీకిలకు ప్రాధాన్యం లభించింది అని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి తాను చేరుతున్నట్టు శాంత తెలిపారు. దేశంలో ఎవరు అమలు చేయలేని పథకాలని జగన్ అమలు చేశారు అని శాంత తెలిపారు. ప్రతి ఒక్కరికి తాను తోడు ఉంటాను అని, అందరం కలిసి జగన్ కి అండగా ఉందామని అన్నారు. అయితే శాంత ఉదయం పార్టీలో చేరారు. సాయంత్రానికి ఆమెకి ఎంపీ సీట్ ని ప్రకటించారు. హిందూపురం లోక్ సభ నియోజకవర్గం సమన్వయకర్తగా శాంతని ప్రకటించారు. శాంత సోదరుడు శ్రీరాములు, గాలి జనార్దన రెడ్డికి అత్యంత సన్నిహితులు.
గాలి జనార్ధన రెడ్డి ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శ్రీరాములు, బళ్లారిలో ఎంపీగా గెలిచారు. ఇప్పుడు కర్ణాటక నుండి వచ్చి శాంత హిందూపురంలో పోటీ చేయబోతున్నారు. శాంత సొంత ఊరు గుంతకల్లు అని సమాచారం. ఉదయం పార్టీలో చేరితే, సాయంత్రానికల్లా ఎంపీ సీట్ ఇచ్చేయడం అనేది ఆసక్తికరంగా మారింది. హిందూపురంలో గత ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆయన స్థానంలో శాంతకి అవకాశం ఇచ్చారు. గోరంట్ల మాధవ్ ఈసారి హిందూపురం నుండి పోటీ చేయాలి అనుకున్నా కూడా అవకాశం దొరకలేదు. దాంతో గోరంట్ల మాధవ్ కి మరొక చోట నుండి అవకాశం కల్పిస్తారా? లేదా? అనే విషయం మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ALSO READ : JANASENA PARTY : జనసేన పార్టీలోకి కొత్తగా చేరిన “చైతన్య” ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే..?