టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్ది రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు నిలిచారు.
ప్రస్తుతం ఆయనను కోర్టు ఆదేశాలతో ఈ జైలులోనే సీఐడీ ఆఫీసర్లు విచారిస్తున్నారు. కోర్టు ఇచ్చిన సీఐడీ కస్టడీ పౌరతి కావడంతో సీఐడీ కోరిన విధంగా చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబర్ 5 వరకు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ వార్తల్లో నిలిచింది. ఈ జైలు ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు ప్రకారం, రాజమండ్రి సెంట్రల్ జైలుకు వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. డచ్ వారు 1602 లో ఒక కోటను నిర్మించారు. ఆ కోటనే ఆ తరువాత కాలంలో జైలుగా మార్చారని హిస్టరీ పుస్తకాల్లో ప్రస్తావించారు. బ్రిటిష్ పాలకులు డచ్ వారు నిర్మించిన కోటను జైలుగా మార్చినట్టుగా చెబుతున్నారు. ఆ జైలు రికార్డుల ప్రకారంగా చూస్తే, 1864 సమాయనికే ఈ కోట జిల్లా జైలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జైలుకు 1890లో సెంట్రల్ జైలుగా గుర్తింపు వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు 133 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉంది.
స్వాతంత్ర్య సమరంలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ సహచరులను లాహోర్ కుట్రకేసులో ఈ జైలుకు ఖైదీలుగా తరలించారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం వివిధ ఉద్యమాలకు లీడర్ గా ఉన్నవారిని కూడా ఈ జైలులో ఖైదీలుగా ఉంచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వైశాల్యం పరంగా దేశంలో 4వ పెద్ద జైలు. ఇది 212 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 39.02 ఎకరాల్లో జైలు నిర్మించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విధంగా సెంట్రల్ జైలును నిర్మించారు.
ఈ జైలులో దాదాపు 3 వేల మంది ఖైదీలను ఉంచడానికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. 2015లో ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో రాజమండ్రి సెంట్రల్ జైలుని ఆధునీకరించారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడుతో ములాఖత్‌కు వెళ్ళిన ఆయన సతీమణి భువనేశ్వరి బయటికి వచ్చిన తరువాత ‘‘ఆయన నిర్మించిన బ్లాకులోనే ఆయనను ఖైదీగా ఉంచారు’’ అని వాపోయారు.
ఇక ఈ జైలులో చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా మరో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఖైదీలుగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ జైలులో కొంతకాలం ఉన్నారు. అయితే, ఆయన సీఎం కాక ముందు జైలుకు వెళ్లారు. ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఈ జైలులో కొద్ది రోజులు ఉన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఆదేశాలను ధిక్కరించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. ప్రకాశం పంతులు కూడా సీఎం కాక ముందు జైలుకు వెళ్లారు.