ఇంట్లో పనిచేసే పనిమనిషి.. పనిచేసి వెళ్లిందా.. జీతం ఇచ్చామా.. అంతవరకే ఉంటారు యజమానులు.. తనెప్పుడైనా సమస్యల్లో ఉంటే కొంచెం డబ్బు సాయం చేసి ఊరుకుంటారు..అంతకుమించి వెళ్లడానికి ఆసక్తి చూపరు..ఎందుకంటే తను పనిమనిషి..తను ఆ ఇంటి పనులు చేయగలదు తప్ప ఎప్పటికి ఆ ఇంటి మనిషి కాలేదు..కానీ గౌతం గంభీర్ ఇందుకు భిన్నంగా ప్రవర్తించి అందరి మనసులు గెలుచుకున్నారు.
“నా చిన్నారులను జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పటికీ పనిమనిషి కాదు . తను మా కుటుంబంలో ఒక సభ్యురాలు. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత” అంటూ గంభీర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. సరస్వతి పాత్రా గత ఏడేళ్లుగా గంభీర్ వాళ్ల ఇంట్లో పనిచేస్తున్నారు.ఈమె గత కొంత కాలంగా డయాబెటీస్, బిపి తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, అనారోగ్య కారణంగా ఇటీవల మరణించారు.
సరస్వతి సొంత ఊరు ఒడిసాలోని జాజ్ పూర్.. అయితే ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ వేళలో సరస్వతి మృతదేహాన్నిన్యూఢిల్లీ నుండి ఒడిసాకు తీసుకువెళ్లలేని పరిస్థితి. ఇదే విషయాన్ని గంభీర్ దృష్టికి తీసుకువెళ్లారు సరస్వతి కుటుంబసభ్యులు. తాను ఎంపీ స్థానంలో ఉన్నప్పటికి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం ఇష్టం లేక, అదే విషయాన్ని ఆ కుటుంబ సభ్యులకు వివరించి, సరస్వతి అంత్యక్రియలు ఢిల్లిలోనే జరిగేలా చూసారు. అంతేకాదు తనే దగ్గరుండి సరస్వతి పాత్రా అంత్యక్రియలు నిర్వహించారు.
“కుల, మత, వర్గ, సామాజిక అంతరాలకు అతీతంగా వ్యవహరించడంలోనే హుందాతనం ఉంటుందని నేను నమ్ముతాను. మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదు. నా దృష్టిలో అదే నిజమైన భారత్! ఓం శాంతి” అంటూ ట్వీట్ చేశారు గంభీర్.. దీంతో గంభీర్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ అందరూ అతని మానవతాదృక్పతానికి సలాం కొడుతున్నారు.