నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన 18 పేజెస్ సినిమా డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతోంది. గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA 2 సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కుమారి 21 ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం సూపర్ హిట్ కావడం తో ఈ చిత్రం పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ తో మరోసారి జంట కట్టనుంది.
అయితే అనుపమ ఇటీవల డీజే టిల్లు సీక్వెల్ నుంచి తప్పుకుందని వచ్చిన వార్తలు తెలిసిందే. అయితే ’18 పేజెస్’ ప్రమోషన్స్ లో భాగం గా అనుపమ కు దీని గురించి ప్రశ్న ఎదురవగా.. ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ అయ్యింది.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు చిత్రం సూపర్ హిట్ అయిన విషయం, తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సిద్ధూ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించారు. దీనికి ఇప్పుడు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా మొదట శ్రీలీల పేరు వినిపించింది. తర్వాత అనుపమ ఒక వారం పాటు షూటింగ్ లో పాల్గొన్న తర్వాత సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ చిత్రం నుంచి ఎందుకు తప్పుకున్నారు అని అనుపమని అడగ్గా..” ఇప్పుడు 18 పేజెస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. టిల్లు స్క్వేర్ లో ఏం జరుగుతోందో నాకు తెలియదు. నేను కూడా కొన్ని ఆర్టికల్స్ చదివాను” అంటూ స్పందించింది అనుపమ. దీంతో అనుపమ ఆ చిత్రం గురించి మాట్లాడాలి అని కూడా అనుకోవట్లేదని అర్థం అవుతోంది. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ కి మడోన్నా సెబాస్టియన్, మీనాక్షి చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే హీరో సిద్ధూ జొన్నలగడ్డ తో విబేధాల కారణంగానే హీరోయిన్లు తప్పుకుంటున్నారని రూమర్స్ వస్తున్నాయి.