పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ప్రకటన ఒకటి ప్రస్తుతం దుమారం రేపుతోంది. కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుండి తాను పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గురువారం ప్రకటించారు. జనసేన పార్టీ మొదలు పెట్టి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. జనసేన కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన వల్ల ఆనందంలో ఉన్నారు. కానీ మరొక పక్క తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రం ఆగ్రహానికి గురవుతున్నారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు అయితే పవన్ కళ్యాణ్ మీద కోపోద్రిక్తులు అవుతున్నారు. పిఠాపురం టికెట్ ని వర్మకి కేటాయించాలి అని అంటున్నారు. అంతే కాకుండా, పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రకటించిన తర్వాత తెలుగు దేశం పార్టీ కార్యాలయం దగ్గర చంద్రబాబు, నారా లోకేష్ ఫ్లెక్సీలను చించివేశారు. కరపత్రాలను కూడా కాల్చారు. టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు తగలబెట్టడం మాత్రమే కాకుండా, ప్రధాన కూడళ్ల దగ్గర వర్మకు మద్దతు ఇస్తూ నిరసనలు జరిపారు.
అసలు ఎవరు ఈ వర్మ? తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు వర్మ. తెలుగు దేశం పార్టీ నుండి పిఠాపురంలో 2009 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజారాజ్యం పార్టీ నుండి అభ్యర్థిగా నిలబడిన వంగా గీత చేతిలో కొంచెం తేడాతో వర్మ ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ 2014 లో టికెట్ నిరాకరించడంతో, తెలుగు దేశం పార్టీ రెబెల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. అప్పుడు వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు మీద ఎంతో మెజారిటీతో వర్మ గెలిచారు. మొదటి సారిగా ఎమ్మెల్యే అయ్యి, అసెంబ్లీలోకి అడుగు పెట్టారు వర్మ.
ఆ తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరిన వర్మ, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలోనే ఓడిపోయారు. అప్పటి నుండి కూడా వర్మ తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ గా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన నుండి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో, వర్మ మద్దతుదారులు ఆగ్రహానికి గురవుతున్నారు. అయితే, ఇప్పుడు సీట్ ఒకవేళ దక్కకపోతే, తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి, ఇంకొకసారి స్వతంత్ర అభ్యర్థిగా వర్మ నిలబడాలి అని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ALSO READ : అప్పుడు “జూనియర్ ఎన్టీఆర్” కి జోడీగా నటించిన హీరోయిన్ … ఇప్పుడు తల్లిగా..? ఎవరంటే..?