వాక్సిన్ వేయించుకోవడం దాదాపు పూర్తి కావొస్తున్నా.. మానవాళి ఈ కరోనా బెడద ఇంకా తప్పలేదు. థర్డ్ వేవ్ రూపంలో ఈ మహమ్మారి మరో సారి ముంచుకు రాబోతోందని ప్రభుత్వాలు సైతం ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను అమలు చేస్తున్నాయి.
ఏపీలో సైతం నైట్ కర్ఫ్యూ నిబంధనలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యింది. మరో వైపు ఓమిక్రాన్ వేరియంట్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన ప్రకారం గత ఇరవై నాలుగు గంటల్లో భారత్ లో 1,79,723 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 13.29శాతంగా ఉంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ థర్డ్ వేవ్ మున్ముందు ఏ స్థాయిలో ఉంటుంది..? ఎప్పటికి ముగుస్తుంది ? వంటి విషయాలపై ఓ అంచనాకి రావడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో ఐఐటి కాన్పూర్ లో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫసర్గా పనిచేస్తున్న మనీంద్ర అగర్వాల్.. థర్డ్ వేవ్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్యా, ఎంత వేగంగా ఇది వ్యాప్తి చెందుతోంది.. అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని తన అంచనాలను వెల్లడించారు. ఢిల్లీ, ముంబై లలో జనవరి నెల మధ్యలో కేసులు పీక్స్ లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆ తరువాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.
అలాగే ఫిబ్రవరి నాటికి థర్డ్ వేవ్ కర్వ్ పీక్స్ కు చేరే అవకాశం ఉంటుందన్నారు. ఈ దశలో రోజువారీ 4 నుంచి 8 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మార్చి నెల మధ్య నాటికి కరోనా మూడవ వేవ్ ముగింపుకు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఎన్నికల ర్యాలీలలో కరోనా వ్యాపించదు అని చెప్పలేమన్నారు. వైరస్ వ్యాప్తికి పలు కారణాలు దోహదపడతాయన్నారు. ఇతర దేశాల ప్రభుత్వాలతో పోలిస్తే.. భారత్ ఇచ్చే డేటా మెరుగైనదిగా ఉందని అన్నారు. జనాభా సంఖ్య, వ్యాధి నిరోధకశక్తిని దృష్టిలో పెట్టుకుంటే.. దక్షిణాఫ్రికా, భారత్ ల మధ్య సారూప్యత ఉందని.. ఓమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో ప్రభావం చూపలేకపోయింది.. ఈ లెక్కన భారత్ లో కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపలేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.