మన కాళ్లకు రక్ష ఏంటంటే పాదరక్షలు అవేనండీ చెప్పులు. చెప్పులు లేనిదే మనం ఒక్క అడుగు కూడా బయటకు వేయడం కష్టం. ఎందుకంటే మన పాదాలను ఎండ వేడి నుంచి, రాళ్లు వంటివి గుచ్చుకోకుండా కాపాడుకోవడానికి ధరిస్తాం.
అసలు విషయం ఏంటంటే ఒక ఊరిలో చెప్పులు వేసుకొని తిరగడం అనేది నిషేదం అంట. అక్కడ చెప్పులు వేసుకుని తిరిగితే పెద్ద శిక్ష విధిస్తారు అంట. మరీ ఆ ఊరిలో ఈ వింత ఆచారం ఎందుకు ఉందో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం రండి.
ఆ ఊరి పేరు అండమాన్. ఇది ఒక గ్రామం. ఈ గ్రామం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై కి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండమాన్ గ్రామంలో దాదాపు 130 కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. వారిలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. అయితే ఈ ఊరికి ఒక ప్రవేశ ద్వారం ఉంది. ఈ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పెద్ద చెట్టుని ఈ అండమాన్ గ్రామస్తులు ముత్యాలమ్మ అనే దేవతగా ఆరాధిస్తూ ఉంటారు. ఇలా ఆ చెట్టుని దేవతగా ఆరాధించడం వలన ఆ గ్రామాన్ని కాపాడుతుందని ప్రజల నమ్మకం.
ఈ గ్రామంలోకి రావాలి అంటే ప్రతి ఒక్కరూ ద్వారం బయటే చెప్పులను వదిలి లోనికి ప్రవేశించాలి. అంతేకాకుండా గ్రామంలోని కూడా ఎవరు చెప్పులు వేసుకుని నడవడానికి వీలు లేదు. అలా కాదని ఎవరైనా గ్రామం లోపల చెప్పులు ధరిస్తే కఠినమైన శిక్షకు అర్హులు అవుతారు . ఎందుకంటే గ్రామస్తులు ద్వారం లోపల గ్రామానికి చెందిన భూమి మొత్తాన్ని ఎంతో పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ద్వారం లోపలి భాగాన్ని దేవునికి ఇల్లులా అనుకుంటారు కాబట్టి. గ్రామం రోడ్లపై చెప్పులు వేసుకుని నడవటం వలన దేవుడికి కోపం వస్తుందని వీరి నమ్మకం అని గ్రామస్తులు వెల్లడించారు.
కొసమెరుపు ఏమిటంటే ఈ గ్రామంలో నివసిస్తున్న వృద్దులు మాత్రం మధ్యాహ్నం ఎండలో బయటకు అయినప్పుడు బూట్లు లేదా చెప్పులు ధరించవచ్చు అని గ్రామ పంచాయతీ అనుమతించింది. వృద్దులు కాకుండా వేరే ఎవరైనా చెప్పులు వేసుకుని నడిస్తే ఆ గ్రామపంచాయతీ కఠినంగా శిక్షిస్తే ఉందని, ఈవిధంగా చెప్పులు లేకుండా గ్రామంలో నడవడం అనేది నాలుగు తరాలుగా జరుగుతుందని ఆ గ్రామ మహిళ అయినా పిచ్చమ్మ వెల్లడించారు.