ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే హవా. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్.అసలు ఐపీఎల్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి? ఎవరికి వస్తాయి? క్రికెటర్లకు ఎంత చెల్లిస్తారు?
Video Advertisement
ఇవన్నీ ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడో ఒకసారి అయినా అనుకునే ఉంటారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
బీసీసీఐ :
ఐపీఎల్ ని బీసీసీఐ నిర్వహిస్తుంది. ఇలా మ్యాచ్ లను నిర్వహించడం వల్ల బీసీసీఐకి లాభం ఏమిటంటే, ఈ మ్యాచ్ టెలికాస్ట్ చేయడానికి ఛానల్స్ యాజమాన్యం బీసీసీఐకి పెద్ద మొత్తాన్ని చెల్లిస్తారు. 2008 లో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ పదేళ్ల పాటు ఐపీఎల్ టెలికాస్ట్ చేయడానికి అనుమతుల కోసం బీసీసీఐ కి 8,200 కోట్లు చెల్లించింది. 2018 లో అయిదేళ్ల పాటు టీవీ లో ఇంకా, ఇంటర్నెట్ లో టెలికాస్ట్ చేయడానికి రైట్స్ ని 16,347 కోట్లతో స్టార్ ఇండియా తీసుకుంది.
ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి డబ్బులు వచ్చే ఇంకొక మాధ్యమం స్పాన్సర్ షిప్స్. ప్రతి సంవత్సరం ఐపీఎల్ ని ఏదో ఒక సంస్థ స్పాన్సర్ చేస్తుంది. 2008 నుండి 2012 వరకూ డిఎల్ఎఫ్ కంపెనీ 200 కోట్లకు ఐపీఎల్ స్పాన్సర్ షిప్ తీసుకుంది. 2013 నుండి 2015 వరకు పెప్సీ కంపెనీ 200 కోట్లు చెల్లించి స్పాన్సర్ షిప్ తీసుకుంది. 2016, 2017 టైటిల్ స్పాన్సర్ షిప్ ని వివో కంపెనీ 200 కోట్లు పెట్టి తీసుకుంది.
2018 నుండి 2022 వరకు టైటిల్ స్పాన్సర్ షిప్ ని 2,200 కోట్లు పెట్టి వివో తీసుకుంది. కానీ ఇప్పుడు చైనా, ఇండియా మధ్య గొడవలు రావడంతో వివో స్పాన్సర్ షిప్ రద్దు చేసింది. 2020 టైటిల్ స్పాన్సర్ షిప్ ని డ్రీం 11, 200 కోట్లు చెల్లించి తీసుకుంది. ఇదే కాకుండా అసోసియేట్ స్పాన్సర్ షిప్స్ కోసం కూడా కొన్ని కంపెనీలు బీసీసీఐకి డబ్బులు చెల్లిస్తాయి.
టీం ఓనర్స్ :
ఇంక టీం ఓనర్స్ డబ్బులు ఎలా సంపాదిస్తారు అంటే, మ్యాచ్ ఏ ప్రదేశంలో నిర్వహిస్తే, ఆ స్టేడియం లో టికెట్ డబ్బులు, ఫుడ్ ఐటమ్స్ నుండి వచ్చే ప్రాఫిట్స్ అన్నీ, ఆ ప్రదేశం రిప్రజెంట్ చేస్తున్న జట్టు ఓనర్ కి వెళ్తాయి. ఇంకొకటి స్పాన్సర్ షిప్ ద్వారా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు జెర్సీ మీద ముత్తూట్ ఫిన్ కార్ప్ అని ఉంటుంది.
అంటే వాళ్లు ఈ జట్టుని స్పాన్సర్ చేస్తున్నట్టు. ఇది ఒకటే కాదు స్పాన్సర్ చేసే కంపెనీల పేర్లు అన్నీ ఆ జట్టు జెర్సీ మీద ఉంటాయి. అలా జెర్సీ మీద పేరు రావడానికి, అంటే ఆ జట్టు ని స్పాన్సర్ చేయడానికి ఆ కంపెనీలు జట్టు యాజమాన్యానికి పెద్ద మొత్తం చెల్లిస్తారు.
ఇంకొకటి ఆ జట్టు జెర్సీలను, అలాగే ఆ జట్టు పేరు ఉన్న యాక్సెసరీలను స్టేడియంలో అలాగే ఆన్లైన్లో అమ్మడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి. అంతే కాకుండా బీసీసీఐకి స్పాన్సర్ షిప్స్ నుండి, బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ నుండి వచ్చే మొత్తంలో 50 శాతాన్ని ఐపీఎల్ టీమ్ ఓనర్స్ కి ఇస్తారు.
ఐపీఎల్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రతీ టీం కి వాళ్లకి బయట ఉన్న క్రేజ్ ప్రకారం, వాళ్ల పర్ఫామెన్స్ ప్రకారం డబ్బులు చెల్లిస్తారు. అంటే ఎక్కువ మ్యాచ్ లు గెలిస్తే ఎక్కువ డబ్బులు చెల్లిస్తారు. తక్కువ మ్యాచ్ లు గెలిస్తే తక్కువ డబ్బులు చెల్లిస్తారు. బీసీసీఐ, తాము తిరిగి ఇచ్చే 50% లో కొంత మొత్తాన్ని ప్రైజ్ మనీ కోసం పక్కన పెడతారు.
ప్లేయర్స్ :
ప్రతి ప్లేయర్ కి పారితోషికంతో పాటు, ప్రతి ఐపీఎల్ లో పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇలా అవార్డ్స్ ఉంటాయి. వీటి ద్వారా ప్లేయర్స్ కి డబ్బులు వస్తాయి.
టీవీ ఛానల్స్ :
టీవీ ఛానల్స్ డబ్బులు ఎలా సంపాదిస్తారు అంటే, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. ఒక ఎడ్వర్టైజ్మెంట్ ఉండే నిడివిని బట్టి ఆ కంపెనీ యాజమాన్యం ఛానల్ కి డబ్బులు చెల్లిస్తారు. ఇంకొకటి, ఇప్పుడు అందరి ఇళ్లలోనూ ఐపీఎల్ ప్రసారమయ్యే ఛానల్స్ రావాలి అని రూలేమీ లేదు.
అంటే ప్యాక్ బేస్డ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి అందరి సబ్స్క్రిప్షన్ ఒకటే లాగా ఉండవు. కాబట్టి కొంత మంది ఐపీఎల్ చూడాలి అనుకుంటే వాళ్ల దగ్గర ఆ ఛానల్ లేకపోతే డబ్బులు చెల్లించి ఛానల్ కి సబ్స్క్రిప్షన్ చేయించుకుంటారు. అలా కొన్ని కోట్ల మంది సబ్స్క్రిప్షన్ చేయించుకుంటారు. దాంతో ఆ డబ్బులు ఛానల్ కి వెళ్తాయి.
ఎలా ఉపయోగిస్తారు :
ఇలా వచ్చే డబ్బులను బీసీసీఐ, డొమెస్టిక్ ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచ్ లను కండక్ట్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ కి ఉపయోగిస్తారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో భద్రపరుస్తారు. ట్రావెలింగ్ ఖర్చులు, స్టాఫ్ ఖర్చులు, ఎకామిడేషన్ (హోటల్) ఖర్చులు ఇవన్నీ ఐపీఎల్ టీమ్ ఓనర్లు భరిస్తారు.
ప్రభుత్వం :
ఐపీఎల్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ప్రాఫిట్ వస్తుంది. దాంతో వాళ్లు కొంత మొత్తాన్ని టాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తారు. దాంతో ఐపీఎల్ ద్వారా ప్రభుత్వం కూడా కొంత లాభం పొందుతుందన్నమాట.