అంతర్జాతీయ క్రికెట్లో పోటీ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ స్థాయి ప్లేయర్స్ తో తలపడాలంటే ఒక్క నైపుణ్యం, ఫామ్‌ ఉంటే సరిపోదు. వారి స్థాయిలో ఫిట్‌నెస్‌ కూడా ఉండాలనేది టీం ఇండియా  మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం.

Video Advertisement

అందుకోసమే ఐదు సంవత్సరాల క్రితం యోయో ఫిట్‌నెస్‌ టెస్ట్ ను ప్రవేశ పెట్టారు. ప్రతి క్రికెటర్ ఈ పరీక్షలో తప్పనిసరిగా పాస్ అవ్వాలనే నియమాన్ని పెట్టారు. మరి యోయో టెస్ట్ అంటే ఏమిటి? అది ఎందుకు? ఎలా నిర్వహిస్తారో ఇప్పుడు చూద్దాం..
యోయో ఫిట్‌నెస్‌ టెస్ట్ మొదలుపెట్టిన వ్యక్తి శంకర్‌ బసు. ఆయన ఒకప్పడు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ గా పనిచేశారు. ఇండియన్ క్రికెట్లో అత్యున్నత ఫిట్‌నెస్‌ స్టాండర్డ్స్ ను నెలకొల్పిన విరాట్‌ కోహ్లి భారతజట్టు కెప్టెన్‌గా ఉండటం వల్ల యోయో టెస్ట్ కు తేలికగా ఆమోదం వచ్చింది. అప్పటి భారత జట్టు కోచ్‌ రవిశాస్త్రి ఈ టెస్ట్ ను సపోర్ట్ చేశాడు. 2018 నుంచి 3 ఏళ్ల పాటు యోయో టెస్ట్ లో పాస్‌ అవడం అనేది భారత ప్లేయర్స్ కు తప్పనసరి అయ్యింది.
అత్యుత్తమ ఫిట్‌నెస్‌ ఉన్నవారు మాత్రమే యోయోలో పాస్ అవగలరు. యువరాజ్‌ సింగ్, సురేశ్‌ రైనా వంటి సీనియర్ క్రికెటర్లు మాత్రమే కాకుండా పృథ్వీ షా, వాషింగ్టన్‌ సుందర్ లాంటి యంగ్ ప్లేయర్స్ కూడా ఈ టెస్ట్ ను పాస్ కాలేక  ఇబ్బంది పడ్డారు. కోహ్లి టీం ఇండియా కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు ఈ టెస్ట్ ను కఠినంగా అమలు చేశారు. యోయో టెస్ట్‌ లో వచ్చిన స్కోరును బట్టే భారత క్రికెట్‌ జట్టులో స్థానం లభిస్తుంది. ఎంత పెద్ద క్రికెటర్‌ అయినా సరే ఈ పరీక్షలో ఫెయిలైతే అంతే.
ఇటీవల బీసీసీఐ యోయో టెస్ట్‌తో పాటుగా రెండు 2 కిలోమీటర్ల పరుగును కూడా అమలులోకి  తెచ్చింది. ఈ రెండింటిలో ఏదో ఒక దానిలో క్రికెటర్లు తప్పనిసరిగా పాస్‌ కావాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ లో భాగంగా ఇరవై మీటర్ల ఎడంతో 2 కోన్‌లను ఏర్పాటు చేస్తారు. క్రికెటర్లు వీటి మధ్య పరుగెత్తాల్సి ఉంటుంది.  దీనిలో ఉండే స్థాయిలను బట్టి,  ప్రతి ఆటగాడు పరుగెత్తే వేగాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ఒక ఆటగాడు పరుగు మొదలుపెట్టే ముందు బీప్‌ సౌండ్‌ వస్తుంది. మళ్ళీ బీప్‌ సౌండ్‌ వచ్చేలోపు అవతలి ఎండ్‌కు ఆ ఆటగాడు వెళ్లాలి.
మళ్ళీ బీప్‌ వినిపించేలోపు మళ్లీ మొదలుపెట్టిన చోటుకి రావాలి. ఒకసారి ఇలా చేస్తే ఒక షటిల్‌ కంప్లీట్ అయినట్టుగా పరిగణిస్తారు. ఒక షటిల్‌లో ఒక ఆటగాడు 40 మీటర్లు రన్ చేస్తాడు. క్రికెటర్లు పూర్తి చేసిన షటిళ్లను బట్టి స్కోరును లెక్కిస్తారు. షటిల్‌ కు షటిల్ కు మధ్య  5- నుండి 10 సెకన్ల వరకు విరామం ఉంటుంది. బీప్‌ సౌండ్ ను ఎవరూ కంట్రోల్ చేయలేరు. టెస్ట్ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా జరుగుతుంది.షటిల్‌ కంప్లీట్ చేసే టైమ్ లో మొత్తం 3 బీప్స్‌ వస్తాయి. షటిల్ మొదలవడానికి ముందు ఒక బీప్‌, ఆ తరువాత 20 మీటర్ల దూరానికి ఒక బీప్‌, మళ్ళీ  20 మీటర్లకు ఒక బీప్ వస్తుంది. ఈ బీప్‌ శబ్దం వినిపించేలోపే ఆటగాడు తన లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒక బీప్‌ కానుక మిస్సయితే కోచ్‌, ట్రైనర్‌ ఆ ఆటగాడికి వార్నింగ్‌ ఇస్తారు. 2 బీప్స్‌ మిస్సయితే ఆ ఆటగాడి పరీక్ష ముగిసినట్లే. ఆ ఆటగాడు యోయో టెస్ట్‌లో ఫెయిలయ్యాడని అర్ధం.

Also Read: ఆసియా కప్‌లో అతనికి చోటు దక్కలేదు… కాపాడడానికి ధోనీ కూడా లేడు.! ఇక రిటైర్ అవ్వాల్సిందేనా.?