తాజాగా ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు.. బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్‌కు సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. సుమారు 290 మంది మరణించగా.. 1200 మందికి పైగా గాయపడ్డారు.
ఈ స్థాయిలో ప్రమాదం జరగడం.. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దేశ చరిత్రలో అతి భయానక రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచిపోతుంది. అయితే ఈ ప్రమాదంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దినసరి కూలీల నుంచి ఎందరో పొట్ట చేతబట్టుకొని వచ్చిన వారు ఈ ప్రమాదంలో బలయ్యారు. కోరమాండల్ రైలు ప్రమాదంలో సాంకేతిక వైఫల్యాల కంటే మానవ తప్పిదమే ఉందని తెలుస్తోంది.
అయితే ఈ ప్రమాదంలో అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడు పినాకి రంజన్ మోండల్. ఈయన బాలాసోర్ స్టేషన్ లో లెమన్ టీ విక్రయిస్తూ ఉంటారు. శుక్రవారం సాయంత్రం కూడా అలాగే టీ విక్రయించేందుకు చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. అయితే తాను ఆ తర్వాతి స్టేషన్ అయిన భద్రక్ వరకు ప్రయాణించి మిగిలిన టీ అమ్మి.. తిరిగి బాలాసోర్ కి చేరుకుంటానని పినాకి రంజన్, అతని స్నేహితుడు, రూమ్మేట్ అయిన సుజోయ్ జానాకి చెప్పాడు.
సుజోయ్ బాలాసోర్ లో దిగిపోయి.. వాళ్ళిద్దరి కోసం వంట చేయడం ప్రారంభించాడు. కానీ కోరమాండల్ భద్రక్ చేరుకునేలోపే ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో నివసించే మోండల్ బంధువు బిట్టు షా సుజోయ్ కి ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. జానా వెంటనే మోండల్‌కి మొబైల్‌కి కాల్ చేసినా రింగ్ అవ్వలేదు.
సుజోయ్ వెంటనే తెలిసిన వారి సాయంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. నుజ్జునుజ్జయింది బోగీల మధ్య మోండల్ కోసం వెతుకులాట ప్రారంభించాడు సుజోయ్. చివరికి రాత్రి 10 గంటల సమయంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అతడు తీవ్రంగా గాయపడి మరణించినట్లు సుజోయ్ తెలిపాడు. ఆ తర్వాతి రోజు మోండల్ భార్య అతడిని గుర్తించింది.
“పినాకి రంజన్ తెల్లవారుజామున 4 గంటల నుండి మధ్యాహ్నం వరకు వివిధ రైళ్లలో టీ అమ్మేవాడు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్ళేవాడు. అతను రోజుకు రూ. 700-800 రూపాయలు సంపాదించేవాడు. ప్రతివారం హౌరా వచ్చి కుటుంబాన్ని కలిసి వెళ్ళేవాడు. అతను చనిపోయి ఇంటికి తిరిగి వస్తాడని నేను ఊహించలేదు.” అని ఆయన భార్య జ్యోత్స్నా వెల్లడించారు.
“పినాకి రంజన్ మోండల్‌కి ఇద్దరు పిల్లలు. మోండల్ రాజస్థాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కరిమికుడిగా పనిచేసేవారు. నోట్ల రద్దు తర్వాత ఉద్యోగం కోల్పోయిన అతను 2017లో ఇంటికి తిరిగి వచ్చి రైళ్లలో టీ అమ్మడం మొదలుపెట్టాడు. ఆయన మొదట లోకల్ రైళ్లలో టీ అమ్మేవాడు. అయితే తన పిల్లల చదువు ఖర్చులు పెరిగిన తర్వాత ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మారాడు. ఒక కప్పు లెమన్ టీ మీకు లోకల్ రైలులో రూ. 5 కాగా ఎక్స్‌ప్రెస్ రైలులో రూ. 10 ” అని ఆయన సోదరుడు ప్లాబన్ తెలిపారు.
Also read: “కోరమాండల్ ఎక్స్‌ప్రెస్” ట్రైన్ ప్రమాదం జరగడానికి కారణం ఇదేనా..? ఇలా చేయకపోయి ఉంటే..?