తమిళిసై సౌందరరాజన్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని రాష్ట్రపతికి పంపించారు. అయితే, అంతకుముందు కొన్ని రోజుల నుండి తమిళిసై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారు అనే ఒక వార్త వినిపించింది. కానీ ఇప్పుడు తమిళిసై రాజీనామా లేఖని సోమవారం నాడు పంపించడంతో ఈ వార్తలు నిజం అని అర్థం అవుతోంది. రాష్ట్రానికి రెండవ గవర్నర్ గా తమిళిసై నియమితులు అయ్యారు. ఎన్నోసార్లు ప్రభుత్వం తనని గౌరవించట్లేదు అని తమిళిసై చెప్పారు. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది.
తమిళిసై సౌందరరాజన్ స్వతహాగా తమిళనాడుకి చెందినవారు. తమిళనాడులోని కన్యాకుమారిలోని కలియక్కవిలైలో ఆమె పుట్టారు. తమిళిసై తండ్రి కుమారి అనంతన్, తమిళనాడులో మాజీ పార్లమెంటు సభ్యుడిగా పనిచేయడం మాత్రమే కాకుండా, సీనియర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడిగా కూడా ఉన్నారు. నటుడు, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు అయిన విజయ్ వసంత్ కూడా తమిళిసైకి బంధువు అవుతారు. తమిళిసై భర్త సౌందరరాజన్ ఒక డాక్టర్. తమిళిసై ఎథిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత చెన్నైలో ఉన్న మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుకున్నారు.
చెన్నైలో ఉన్న డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీలో ఒబెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీలో స్పెషలైజేషన్ పొందారు. కెనడాలో ఎఫ్ఈటీ (ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్) థెరపీలో శిక్షణ పొందారు. రాజకీయాల్లోకి రాకముందు 5 సంవత్సరాల పాటు చెన్నైలో ఉన్న రామచంద్ర మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. తమిళిసైకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. వారు కూడా డాక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పటినుండి రాజకీయ కుటుంబంలో పెరగడంతో అప్పటి నుండే రాజకీయాల మీద ఆసక్తి పెరిగింది.
తమిళిసై 1999 లో దక్షిణ చెన్నై జిల్లా మెడికల్ వింగ్ సెక్రటరీగా, 2001 లో మెడికల్ వింగ్ లో రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, 2005 లో దక్షిణాది రాష్ట్రాలకు వైద్య విభాగంలో ఆల్ ఇండియా కో-కన్వీనర్ గా, 2007 లో స్టేట్ జనరల్ సెక్రటరీగా, 2010 లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసి, ఆ తర్వాత 2013 లో బీజేపీ నేషనల్ సెక్రెటరీగా పదోన్నతి పొందారు. సెప్టెంబర్ 1వ తేదీ, 2019 లో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశం ద్వారా తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. రాష్ట్ర పదవిని నిర్వహిస్తున్న మొదటి మహిళగా కూడా ఈమె ఘనత పొందారు. సెప్టెంబర్ 9వ తేదీ, 2019 లో తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు.
తమిళిసైకి, ఫిబ్రవరి 16వ తేదీ 2021 లో పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం)కి అదనపు బాధ్యతలు అప్పగించారు. కేంద్రపాలిత ప్రాంతంలో విధులు నిర్వహించిన ఐదవ మహిళగా ఈమె ఘనత పొందారు. కోవిడ్ సమయంలో కూడా ఆస్పత్రులకు వెళ్లి వ్యాక్సినేషన్ను సరైన సమయంలో అందించడానికి తనవంతు కృషి చేశారు. తమిళిసై 2006, 2011 లో శాసనసభ సభ్యురాలిగా, 2009, 2019 లో లోక్ సభ సభ్యురాలిగా పోటీ చేశారు. 2 అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమిళిసై ఓడిపోయారు.
2019 లో భారత సార్వత్రిక ఎన్నికలలో, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమార్తె, కనిమొళి కరుణానిధిపై తూత్తుక్కుడి నియోజకవర్గం నుండి ఓడిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో, 2006 లో రాధాపురం నియోజకవర్గం నుండి, 201లో వేలచేరి నియోజకవర్గం నుండి, 2016 లో విరుంగంపక్కం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు 2024 లో చెన్నై సెంట్రల్, తూత్తుక్కుడి నియోజకవర్గాల నుండి పోటీ చేయాలి అని అనుకుంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలి అని ఆశిస్తున్నారు. ఈ కారణంగానే తమిళిసై తన గవర్నర్ పదవికి రాజీనామా చేయాలి అనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తమిళిసై తన తర్వాత ఆలోచనలు ఏంటి అనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ALSO READ : ఈ వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడు ఎవరో తెలుసా? తెలుగులో టాప్ డైరెక్టర్..!