మేకప్ మహిమలు మాములుగా లేవు. ముఖ కవళికలు ఎలా కావాలనుకుంటే అలా మార్చేసుకునే రోజులు వచ్చేసాయి. ముఖం ఎలా ఉన్నా.. కాస్త మేకప్ అద్దితే చాలు అందమైన వ్యక్తులలా తయారైపోతున్నారు. ఇక.. అమ్మాయిలు కూడా ఈ మేకప్ ని అడ్డు పెట్టుకుని మోసాలు కూడా చేసేస్తున్నారు. అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. అందులో తప్పులేదు.
కానీ, కొందరు అందాన్ని అడ్డుపెట్టుకుని అబ్బాయిలని మోసం చేస్తూ ఉంటారు. తాజాగా ఇటువంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘటనలో అమ్మాయి కాదు.. ఏకంగా 54 సంవత్సరాల వయసు ఉన్న మహిళ ఓ వ్యక్తిని మోసం చేసి పెళ్లి చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా, పుదుప్పేట కు చెందిన ఇంద్రాణి అనే మహిళ తన కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. ఇంద్రాణి కుమారుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి పెళ్ళై విడాకులు కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో అతనికి రెండవ పెళ్లి చెయ్యాలని ఇంద్రాణి సంబంధాలు వెతుకుతోంది. గత ఆరేళ్లుగా సంబంధాలు వెతుకుతున్న ఆమెకు ఇటీవల తిరుపతికి చెందిన శరణ్య అనే మహిళ పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా పరిచయమైంది.
అయితే.. ఆమె వయసు 54 సంవత్సరాలు అన్న విషయం వీరికి తెలియదు. ఆమెను చూడడానికి వస్తున్నామని కబురంపారు. దీనితో శరణ్య మేకప్ వేసుకుని 30 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలా వారి ముందు కూర్చుంది. ఆ అమ్మాయి కూడా ఇంద్రాణి కుమారుడికి నచ్చడంతో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. తిరువళ్లూరులో భారీగా ఖర్చు చేసి పెళ్లి కూడా చేసారు. ఆమెకు ఇరవై ఐదు సవర్ల బంగారాన్ని ఎదురిచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. తీరా పెళ్లి చేసిన తరువాత ఆమె తన అసలు రూపం చూపించింది.
అత్తా, భర్తలను వేధించేది. శాలరీ మొత్తం తన చేతిలోనే పెట్టాలని చెప్పేది. బీరువా తాళాలను తన చేతికే ఇవ్వాలని, ఆస్తులను కూడా తన పేరు మీదకే రాయించాలని పోరు పెడుతుండేది. ఈ క్రమంలోనే అత్త ఇంద్రాణిని ఇంట్లోంచి వెళ్లగొట్టింది. ఈమె పోరు పడలేని భర్త ఆమె పేరు మీదకే ఆస్తి రాయిద్దామని ఆధార్ కార్డు ఇవ్వాలని కోరాడు. అయితే.. ఆధార్ కార్డు లో కేరాఫ్ రవి అని ఉండడాన్ని గమనించిన సదరు భర్తకి అనుమానం వచ్చింది. దీనితో, ఇంద్రాణి మరియు ఆమె కుమారుడు కలిసి కేసు వేశారు. పోలిసుల విచారణలో ఆమె వయసు 54 సంవత్సరాలని, ఆమెకు రవి అనే వ్యక్తితో ఇదివరకే పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తేలింది.
భర్తతో గొడవపడి ప్రస్తుతం తల్లితో ఒంటరిగా ఉంటోందని తేలింది. రవి పై కూడా ఆమె కేస్ పెట్టి పది లక్షల రూపాయలను లాగేసింది అని కూడా తేలింది. అయితే.. సంపాదన లేని కారణంగా ఆర్ధిక ఇక్కట్లు మొదలవ్వడంతో పెళ్లిళ్ల బ్రోకర్ ను సంప్రదించి యువకులను మోసం చేసి డబ్బు గుంజుతోంది. ఈ క్రమంలోనే సుబ్రమణి అనే వ్యక్తికి సంధ్యగా పరిచయం అయ్యి పదకొండు సంవత్సరాలు కాపురం కూడా చేసింది. ఆ తరువాత కరోనా సమయంలో తల్లి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి.. తిరిగి రాకుండా అక్కడనుంచి తప్పించుకుంది. ఈ క్రమంలోనే ఇంద్రాణి కుమారుడి గురించి కూడా తెలియడంతో తనకింకా పెళ్లి కాలేదని చెప్పి తన పేరు శరణ్యగా పరిచయం చేసుకుని ఇంత కథ నడిపించింది.