- చిత్రం : విడుదల పార్ట్-1
- నటీనటులు : సూరి, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్.
- నిర్మాత : ఎల్రెడ్ కుమార్
- దర్శకత్వం : వెట్రిమారన్
- సంగీతం : ఇళయరాజా
- విడుదల తేదీ : ఏప్రిల్ 15, 2023
స్టోరీ:
తమిళనాడులోని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొంతమంది నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారు ప్రభుత్వం చేసే పనులని అడ్డుకుంటూ ఉంటారు. వారు ఒక ప్రాంతంలో గనులు వెలికితీస్తూ ఉంటే, అది వ్యతిరేకిస్తూ అక్కడ బాంబు పేలుస్తారు. ఈ బృందానికి పెరుమాళ్ మాస్టర్ (విజయ్ సేతుపతి) నాయకుడిగా ఉంటాడు. అతనిని పట్టుకోవడానికి డిఎస్పి సునీల్ మీనన్ (గౌతమ్ మీనన్) ఆధ్వర్యంలో రూపొందిన ఒక పోలీస్ బృందం ప్రయత్నిస్తూ ఉంటుంది.
అక్కడే కుమరేసన్ (సూరి) డ్రైవర్ గా చేరతాడు. తాను ఉద్యోగం పరంగా ఏ పని అయినా చేస్తాను, చివరికి బాత్రూంలు అయినా కడుగుతాను అనుకుంటాడు కానీ చేయని తప్పుకి క్షమాపణ మాత్రం చెప్పడు. అయితే పెరుమాళ్ మాస్టర్ ని పట్టుకోవడానికి అదే ఊరిలో ఉన్న కొంత మంది సాధారణ ఆడవారిని, మగవారిని పోలీసులు బంధించి వారిని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. వారిలో కుమరేసన్ ప్రేమించిన పాప అలియాస్ తమిళరసి (భవాని శ్రీ) కూడా ఉంటుంది.
పోలీసులు పెట్టె దారుణమైన హింసలని చూసి తట్టుకోలేక కుమరేసన్, పెరుమాళ్ ఎక్కడ ఉన్నాడో తనకి తెలుసు అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు నిజంగా పెరుమాళ్ ఎక్కడ ఉన్నాడు? అతనిని పట్టుకున్నారా? పెరుమాళ్ ఇలా చేయడానికి గల కారణం ఏంటి? కుమరేసన్ కి నిజంగా పెరుమాళ్ ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఆ తర్వాత పెరుమాళ్ ఏం చేశాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
భారతీయ సినిమా ఇండస్ట్రీలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ అలాంటి సినిమాలు తీసినా కూడా అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలాగా తీసే దర్శకులు ఇంకా తక్కువ మంది ఉన్నారు. వారిలో వెట్రిమారన్ ఒకరు. గత కొన్ని సంవత్సరాలుగా తీసినవి కొన్ని సినిమాల్లో అయినా కూడా ప్రతి సినిమా మంచి కథతో సామాజిక అంశం మీద తీసి ఎన్నో అవార్డులను అందుకున్నారు.
ఇప్పుడు విడుదల సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా కొంత కాలం క్రితమే విడుతలై పేరుతో తమిళ్ లో విడుదల అయ్యింది. ఇది మొదటి పార్ట్ మాత్రమే. ఈ సినిమాకి రెండవ పార్ట్ ఉంది. అది పెరుమాళ్ మాస్టర్ మీద నడుస్తుంది. చాలా సంవత్సరాల నుండి ఎన్నో తమిళ్ సినిమాల్లో కమెడియన్ గా చేసిన సూరి ఈ సినిమాలో సీరియస్ గా హీరో పాత్రలో నటించారు.
సినిమా చూస్తున్నంత సేపు, “ఇంత మంచి నటుడిని ఇప్పటి వరకు ఎవరు ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోలేదు?” అని అనిపిస్తుంది. తన పాత్రలో జీవించారు. విజయ్ సేతుపతి ఉన్నది కొంచెం సేపే అయినా కూడా ఆయన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ లో మొత్తం స్టోరీ విజయ్ సేతుపతి మీదే ఉంటుంది. కాబట్టి ఈ పార్ట్ లో కనిపించిన కొంచెం సేపు అయినా కూడా ప్రేక్షకులకు విజయ్ సేతుపతి పాత్ర మీదే ఆసక్తి నెలకొంది.
సినిమాకి మరొక హైలైట్ అయిన పాత్ర గౌతమ్ మీనన్ పాత్ర. ఇప్పటి వరకు దర్శకుడిగా మాత్రమే తెలిసిన గౌతమ్ మీనన్ గత కొద్ది సంవత్సరాల నుండి సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా చాలా మంచి పాత్రలో నటించారు. మిగిలిన నటీనటులు అందరూ కూడా వారి పాత్రలకి న్యాయం చేశారు. సినిమా చూస్తున్నంత సేపు సినిమాలో జరిగే ఎమోషన్ ని ప్రేక్షకులు ఫీల్ అవుతారు.
కొన్ని సీన్స్ అయితే వారు బాధపడుతుంటే అది చూసి ప్రేక్షకులకు కూడా బాధ అనిపించేలాగా ఉన్నాయి. సినిమాలో ఉన్న ఎమోషన్స్ తెరపై అంత బాగా కనిపించాయి అందుకే ప్రేక్షకులకి అంత బాగా కనెక్ట్ అయ్యాయి. ఇవి మాత్రమే కాకుండా సినిమా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వాలి అంటే సినిమాలో వచ్చే మ్యూజిక్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఈ సినిమాని తన సంగీతంతో మరొక లెవెల్ కి తీసుకెళ్లారు మాస్ట్రో ఇళయరాజా గారు. పాటలు మాత్రమే కాకుండా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులకి కంటతడి పెట్టించేలాగా ఉంటుంది. తమిళ్ సినిమా అయినా కూడా సబ్జెక్ట్ కేవలం ఒక ప్రాంతానికి చెందినది మాత్రమే కాకపోవడంతో తెలుగు వాళ్ళకి కూడా ఈ సినిమా ఏదో ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్నామని కాకుండా ఒక మంచి సినిమా చూస్తున్నాం అని అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
- నటీనటుల పర్ఫార్మెన్స్
- కథ
- ఎమోషన్స్
- కొన్ని యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- అక్కడక్కడ ల్యాగ్ అయిన కొన్ని ఎపిసోడ్స్
- సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
రేటింగ్:
3/5
ట్యాగ్ లైన్:
ఇలాంటి సినిమాలు ఎప్పుడో తప్ప రావు. అలా వచ్చినప్పుడు తప్పకుండా ప్రోత్సహించాలి. అది కూడా ఇంత బాగా తీసిన సినిమాలు అయితే భాషకు సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీలో అయినా సరే కచ్చితంగా ఆదరించాలి. ఇటీవల కాలంలో వచ్చిన రా ఎమోషనల్ సినిమాల్లో బెస్ట్ సినిమాగా విడుదల సినిమా నిలుస్తుంది.
watch trailer :