ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో, అక్కడ ఉన్న ఆఫ్ఘన్లు వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ దేశ పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు అని వెల్లడించారు.
రషీద్ ఖాన్ తన ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విధంగా ట్వీట్ చేశారు, “ప్రియమైన ప్రపంచ నాయకుల్లారా, నా దేశం ఆందోళనకరమైన పరిస్థితిలో ఉంది. ఎంతో మంది అమాయకులు, పిల్లలు, మహిళలు వీరమరణం పొందుతున్నారు. ఆస్తులు, ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. ఎన్నో వేల మంది తమ కుటుంబాల నుంచి విడిపోతున్నారు.
ఆఫ్ఘన్లని చంపడం ఆపేయండి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ని ధ్వంసం చేయడం కూడా ఆపండి. మాకు శాంతి కావాలి” అని ట్వీట్ చేశారు రషీద్ ఖాన్. ఈ విషయంపై కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ రషీద్ ఖాన్ ప్రస్తుతం చాలా ఒత్తిడికి గురవుతున్నారు అని చెప్పారు. మరొకవైపు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో హమీద్ షిన్వారీ ప్రస్తుతం ఉన్న తీవ్రమైన రాజకీయ మార్పుల నేపథ్యంలో ఆటకు ఎలాంటి ప్రమాదం జరగదు అని చెప్పారు.