పాతికేళ్ల సంధ్యా రంగనాథన్.. భారత జాతీయ ఫుట్ బాల్ టీం లో కీలక ప్లేయర్. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె దేశ విదేశాల్లో పలు టోర్నమెంట్లలో గోల్స్ సాధించి దేశానికీ పలు విజయాలను అందించింది. ఈ స్థాయికి చేరుకోవడం లో కీలక పాత్ర పోషించిన తన తల్లికి సంధ్య తాజాగా ఒక లేఖ రాసి కృతఙ్ఞతలు తెలుపుకుంది. ఆ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Video Advertisement
సంధ్యా రంగనాథన్.. తమిళనాడులోని పన్రూతి అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది. ఆమెకో అక్క. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆమె.. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక కొన్నేళ్ల పాటు అనాథాశ్రమంలోనే పెరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో కడలూరులోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ.. తన చదువును కొనసాగించింది సంధ్య. పాఠశాలలోని బాలికల బృందం స్కూల్ ఆట స్థలంలో ఫుట్‌బాల్ ఆడుకోవడం గమనించిన ఆమె.. వాళ్ల ఆటను తదేకంగా పరిశీలించింది. ఆ అమ్మాయిల ఆటతీరు, క్రీడలోని మెలకువలు ఆమెను ఆకట్టుకున్నాయి. ఎలాగైనా తానూ ఈ బృందంలో చేరాలని, ఫుట్‌బాల్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది సంధ్య.
దీంతో ఆ బాలికల బృందంలో చేరి ఆటలో ఓనమాలు దిద్దింది సంధ్య. మనకు ఆసక్తి ఉన్న విషయాల్ని ఇట్టే నేర్చేసుకున్నట్లు.. తక్కువ సమయంలోనే ఫుట్‌బాల్ క్రీడలో ఆరితేరిందామె. ఆలా తక్కువ సమయం లోనే ‘మహిళల జాతీయ ఫుట్‌బాల్ లీగ్’లో తమిళనాడు తరపున ప్రాతినిథ్యం వహించింది. తర్వాత 2018లో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సంధ్య దేశవిదేశాల్లో పలు టోర్నమెంట్లలో పాల్గొని గోల్స్ సాధించింది.
“కెరీర్ ప్రారంభంలోనే మహిళల జాతీయ ఫుట్‌బాల్ లీగ్‌లో పాల్గొనే అవకాశం నాకు దొరికింది. ఈ టోర్నీ నుంచి ఎంతో నేర్చుకున్నా. తోటి క్రీడాకారిణులు, సీనియర్లతో ఆడుతూ నా ఆటతీరును మెరుగుపరచుకున్నా. నాలోని ప్రతిభను మెచ్చిన కోచ్‌ల చొరవతో జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకున్నా. ఆట విషయానికొస్తే.. ఒడిశా క్రీడాకారిణి గంగోం బాలాదేవి నాకు స్ఫూర్తి!’ అని సంధ్య తెలిపింది.
ఫుట్‌బాల్ జెర్సీలో తన తల్లితో కలిసి దిగిన ఓ ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. ‘ప్రస్తుతం నేనింత స్థాయికి చేరుకోగలిగానంటే.. అందుకు అమ్మే ప్రధాన కారణం. ఒంటరి తల్లిగా తాను నన్ను, అక్కను పెంచి పెద్ద చేసింది. మేం కోరుకున్న జీవితాన్ని మాకు అందించింది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలకోర్చింది.. మరెన్నో త్యాగాలు చేసింది. ఈ ఉత్తమ జీవితం మాకు అమ్మ ప్రసాదించిందే! నా జీవితానికి బలమైన పునాది అమ్మే! తనే నా హీరో! తాను ప్రత్యక్షంగా నా ఆట చూడడం కంటే నాకు సంతోషమేముంటుంది?!’ అంటూ తన విజయం లో కీలక పాత్ర పోషించిన తల్లి కి కృతజ్ఞతలు తెలుపుకుంది సంధ్య.