ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. అలాంటి వేడుకను తమ ఆర్థిక స్థితికి తగ్గట్లుగా వైభవంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇక నేటి తరం యువత పెళ్లిలో గతానికి భిన్నంగా కొత్తదనం ఉండాలని కోరుకుంటున్నారు. తమదైన మార్కుతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ క్రియేటివిటీని ఉపయోగించి ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ యువకుడు ఒక అడుగు ముందుకు వేసి పెళ్లి చేసుకోవడం కోసం వధువు కావాలంటూ ఓ కుర్రాడు ఊరంతా పోస్టర్లు అంటించాడు.ఈ పోస్టర్లు చూసిన గ్రామస్తులంతా అవాక్కయ్యారు. న గురించి ఇతరులకు అడగకుండా నేరుగా తననే కలవాలని ఆ వాల్ పోస్టర్లో రాసుకున్నాడు.అసలు ఆ యువకుడు ఎవరు.? ఎందుకు అలా వాల్ పోస్టర్ రాశాడో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాపట్ల జిల్లా వేటపాలెం లోని రామన్నపేటకు చెందిన అయ్యప్ప కుమార్ (28)కు తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరిగాడు. కరోనాకు ముందు హైదరాబాదులో ఓ చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. కరోనా తర్వాత ఉద్యోగం మానేసి బాపట్ల వచ్చేసాడు. అప్పటి నుంచి తనకు పెళ్లి చెయ్యమని అమ్మమ్మను వేధించేవాడు. అయితే ఉద్యోగం లేకుండా పెళ్లి చెయ్యను అని తన అమ్మమ్మ మందలించేసరికి ఆలోచించి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు అయ్యప్ప.
తన పెళ్లి తానే సెట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే వాల్ పోస్టర్ తయారు చేశాడు. అందులో నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఎటువంటి ఫోన్లు, మెసేజ్లు చేయాల్సిన అవసరం లేకుండా రామన్నపేటలోని మా ఇంటికి వచ్చి ధైర్యంగా నన్ను కలవగలరు. మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడకుండా నేరుగా నాతో మాట్లాడండి.నా పేరు దేవన నీలకంఠం అయ్యప్ప కుమార్, నా వయసు 28 సంవత్సరాలు, చదువు.. డిగ్రీ బీకాం అని రాసుకున్నాడు.
ఈ పాంప్లెట్లను వేటపాలెంలోని అన్ని ప్రధాన సెంటర్లలో అంటించాడు. దీంతో ఈ వాల్ పోస్టర్ చూసిన గ్రామస్తులంతా అవాక్కయ్యారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అయ్యప్ప ఇంటికి వచ్చి అతని అమ్మమ్మను విచారించారు. అయ్యప్పకు ఉద్యోగం లేని కారణంగా మానసిక స్థితి నిలకడగా లేదని అతని అమ్మమ్మ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం పరారీలో ఉన్న పోలీసులు అయ్యప్ప కుమార్ కోసం గాలిస్తున్నారు.