ప్రస్తుతం రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలంటే రాజకీయ వారసత్వం ఉండాలి. లేదంటే కుప్పల తెప్పలుగా డబ్బు ఉండాలి. ఇంకా వేరే దారి ఏదైనా ఉందంటే దానికి మించి పలుకుబడి ఉండాలి. ఇవేమీ లేకుండా ఎమ్మెల్యే అవ్వడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న దగ్గర నుండి ఎన్నికలు అయ్యేంతవరకు విపరీతంగా ఖర్చు చేయాలి.
అడిగిన వాడికి అడిగినంత ఇవ్వాలి, ఓట్లకు డబ్బు పంచాలి ప్రచారానికి డబ్బు ఖర్చు పెట్టాలి, కూడా తిరిగేవారికి డబ్బు ఇవ్వాలి, ఇలా రాజకీయాల్లో ఉండే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు అనూహ్యంగా తొలిసారి అవకాశం దక్కించుకుని విజయాన్నీ సాధించారు. వీరిలో కొందరు రాజకీయాల్లో ఉద్దండులనూ మట్టికరిపించి సంచలనం సృష్టించారు. ఇక ఈ ఎన్నికల్లో సామాన్యులు కూడా సత్తా చాటారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకున్నా.. ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు
అయితే రాజకీయాల్లో సామాన్యులు రాణించడం కష్టమనే అభిప్రాయం నిజం కాదని నిరూపించాడు ఆదివాసీ గోండు బిడ్డ వెడ్మ బొజ్జు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లోనే నివాసముంటున్న బొజ్జు నేడు ఆ పార్టీ ఇచ్చిన టికెట్‌పై పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వెడ్మా బొజ్జు పటేల్ అనూహ్యంగా గెలుపొందారు. భాజపా నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, బీఆర్ఎస్ నుంచి ఎన్నారై, కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్‌లతో పోటీపడినా ఓటర్లు మాత్రం బొజ్జుకే పట్టంకట్టారు. ఆదివాసీ గోండు బిడ్డ అయిన వెడ్మ బొజ్జుది సామాన్య నేపథ్యం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం కల్లూర్‌గూడకు చెందిన నిరుపేద ఆదివాసీ దంపతులు వెడ్మ భీంరావు, గిరిజాబాయిల కుమారుడు వెడ్మబొజ్జు పటేల్. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లో నివాసముంటున్నారు.

పీజీ వరకు చదివిన బొజ్జు తొలుత ఆదివాసీ విద్యార్థి సంఘంలో,తర్వాత ఆదివాసీ హక్కుల పోరాట సమితిలో సలహాదారుడిగా, అనంతరం కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అధిష్టానం ఆశీస్సులతో టిక్కెట్ దక్కించుకున్నారు.తనకు రూ.8.42 లక్షలు అప్పులున్నాయని, ఉమ్మడి ఏపీలో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన ఇంట్లోనే నివాసం ఉంటున్నట్లు నామినేషన్ లో పేర్కొన్నారు. బొజ్జు చదువుకునే సమయంలో పేపర్ బాయ్‌గాను పని చేశారు.ఖానాపూర్ నియోజకవర్గం ఏర్పడ్డాక గోండు సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి కోట్నాక్ భీంరావు ఒక్కరే ఇక్కడ విజయం సాధించారు. మూడు దశాబ్దాల తర్వాత ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా బొజ్జు రికార్డు సృష్టించారు.
మూడు దశాబ్దాల తర్వాత ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తి..హ్యాట్సాఫ్.! 🙏🙏

స్మితా సబర్వాల్ 1977 లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో బెంగాలీ ఫ్యామిలిలో ఆర్మీ అధికారి కల్నల్ ప్రణబ్ దాస్, పురబీ దాస్‌లకు జూన్ 19న జన్మించారు. ఆమె సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదువుకున్నారు. ఐసీఎస్ఈ పరీక్షలో స్మితా సబర్వాల్ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ ఫర్ ఉమెన్ కాలేజ్ నుండి కామర్స్‌లో పట్టా తీసుకున్నారు. 2000లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష రాసిన ఆమె, ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంక్ సాధించింది. అప్పుడు ఆమె వయసు 22 ఏళ్ళు.
2001లో ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో స్మితా సబర్వాల్ అడ్మినిస్ట్రేటివ్ శిక్షణ పూర్తి చేసింది. తన ప్రొబేషన్ టైమ్ లో ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనింగ్ పొందారు. ఆ తరువాత చిత్తూరులోని మదనపల్లి సబ్ కలెక్టర్‌గా ఆమె మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కడప డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌గా గ్రామీణాభివృద్ధి విభాగంలో పనిచేశారు. ఆ తరువాత వరంగల్ మునిసిపల్ కమీషనర్‌గా పనిచేశారు. ఆమె “ఫండ్ యువర్ సిటీ” అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.
ట్రాఫిక్ జంక్షన్లు, ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్‌లు, బస్-స్టాప్‌లు, పార్కులు వంటి పెద్ద సంఖ్యలో పబ్లిక్ యుటిలిటీలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP) క్రియేట్ చేశారు. ఆ తర్వాత విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. 2011 ఏప్రిల్ లో, సబర్వాల్ కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ ఆమె ఆరోగ్యం మరియు విద్యా రంగంలో చాలా కృషి చేశారు. ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగర్ సిటీలో విశాలమైన రోడ్లు, ట్రాఫిక్ జంక్షన్లు, బస్టాప్‌లు, మరుగుదొడ్లు మరియు ఇతర ప్రజా ప్రయోజనాల రూపంలో కొత్త రూపురేఖలను సంతరించుకునేలా చేశారు.
2012–2013లో ప్రధానమంత్రి 20 పాయింట్ల కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉత్తమ జిల్లాగా అవార్డు పొందింది. 2014 సార్వత్రిక ఎన్నికల టైమ్ లో ఆమె మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆమె కలెక్టర్ గా కరీంనగర్ మరియు మెదక్ జిల్లాలను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపింది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఆమె పై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో చేసే తప్పులు చేసి, ఇప్పుడు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళడం ఫ్యాషన్ అయ్యిందని, ఆమెని వెళ్ళకుండా చూడాలని ‘దేశం మొత్తంలో హెలికాప్టర్లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమెగారు మాత్రమే’ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు.
జట్టులో ఓపెనర్ల పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో, అలాగే ఫినీషర్ల పాత్ర కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మ్యాచ్ ప్రారంభంలో ఎంత బాగా ఆడినప్పటికీ, మ్యాచ్ ను విజయవంతంగా ముగించే ఫినిషర్ లేకపోతే అప్పటిదాకా ఎంత స్కోర్ చేసిన వ్యర్థమే అవుతుంది. అలా అని జట్టులో ఫినీషర్లు మాత్రమే ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ధోనీ రిటైర్ అయినప్పటి నుండి భారత జట్టు మంచి ఫినీషర్ కోసం చూస్తోంది. ధోనీ లాగా మ్యాచ్ చివరి వరకు నిలిచి మ్యాచ్ ను గెలిపించగల యువ క్రికెటర్ల పై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఐపీఎల్ భారత జట్టుకు ఎందరో మంచి ఆటగాళ్లను ఇచ్చింది. ఈసారి ఐపీఎల్ ద్వారా మంచి ఫినీషర్ లభించినట్టుగా భావిస్తున్నారు. ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా సోమవారం నాడు కోల్‌కతా, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 5 వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు పై గెలిచింది.
మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 179 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు చేసిన కోల్‌కతా జట్టు ఆఖరి బంతికి గెలుపును సాధించింది. కెప్టెన్ నితీశ్ రాణా 51 పరుగులు, ఆండ్రీ రసెల్ 42 పరుగులు, రింకు సింగ్ 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి తమ జట్టును గెలిపించారు. ఇక ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ ఫినీషర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. రింకూ సింగ్ చివరి బంతికి ఫోర్ కొట్టి కోల్‌కతా జట్టును గెలిపించాడు. కోల్‌కతాకు వరుసగా ఇది రెండవ విజయం. దీనితో పాయింట్ల పట్టికలో 5వ స్ధానానికి కోల్‌కతా జట్టు చేరుకుంది.
రింకూ సింగ్ అంతకముందు మ్యాచ్ లో కూడా కీలక సమయంలో తన జట్టును ఆదుకున్నాడు. 35 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే బెస్ట్ చివరి ఓవర్. 5 బాల్స్ లో 28 పరుగులు చేయాల్సి ఉండగా, ప్రతీ బాల్ ని సిక్సర్‌గా మార్చి గుజరాత్ జట్టు పై కోల్‌కతా జట్టుకు విజయాన్ని అందించాడు. ఇలా వరుస మ్యాచ్ లలో రింకూ సింగ్ ప్రతిభను చూసినవారు భారత జట్టుకి మరో ధోనీ దొరికేశాడని అభిమానులు సంతోష పడుతున్నారు.



వచ్చే అసెంబ్లీ ఎలెక్షన్స్ లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్న వైసీపీ, తాజగా 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జులను మార్చింది. కొండెపి- ఆదిమూలపు సురేష్, మంగళగిరి- గంజి చిరంజీవి, ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, వేమూరు- వరికూటి అశోక్ బాబు,సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, తాడికొండ- మేకతోటి సుచరిత, చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు, అద్దంకి- పాణెం హనిమిరెడ్డి, గుంటూరు పశ్చిమ- విడదల రజినీ, గాజువాక- వరికూటి రామచంద్రరావు, రేపల్లె- ఈవూరు గణేష్ లను ఇన్చార్జులగా నియమించారు.
యర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిమూలపు సురేష్‌ను తాజాగా కొండెపికి ఇన్చార్జిగా మార్చడం చర్చకు దారి తీసింది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుడు డోలా బాలవీరాంజనేయస్వామి స్థానం ఇది. 2014 మరియు 2019 ఎలెక్షన్స్ లో ఇక్కడి నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. అందువల్ల వచ్చే ఎన్నికలలో కూడా ఆయనే పోటీ చేసే అవకాశం ఉండవచ్చు.
కొండెపికి ఇన్చార్జిగా మార్చడం పై తాజాగా ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. నియోజకవర్గ మార్పు విషయంలో పార్టీ నిర్ణయమే పాటిస్తానని, అధిష్టానం ఆదేశాల మేరకు పని చేస్తానని వెల్లడించారు. పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని, సైనికుడిలా పార్టీ విజయం కోసం పనిచేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమకు కెప్టెన్ అని అన్నారు. కొండెపి నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు.


