భారత్ ఓ వైపు అభివృద్ధి చెందినప్పటికీ.. టాయిలెట్స్ విషయం లో మాత్రం భారత్ లో చాలా ప్రాంతాలు వెనకపడే ఉన్నాయి. సరైన టాయిలెట్స్ లేక దేశం లో మహిళలు నేటికీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే. మెట్రో నగరాలను పక్కనపెడితే చాలా గ్రామాల్లో సరైన టాయిలెట్స్ అందుబాటులో లేవు. ఈ క్రమం లో అస్సాం లో బొంగాగావ్ జిల్లాలో, 8,000 కంటే ఎక్కువ ప్లాస్టిక్ బాటిల్స్ తో టాయిలెట్ ను నిర్మించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పలువురు ఈ ఐడియా కి ఫిదా అవుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ 2014 బ్యాచ్ ఐఎఎస్ ఆఫీసర్ అయిన డిప్యూటీ కమిషనర్ లక్ష్మి ప్రియ ఆద్వర్యం లో రూపొందింది. ఈ ప్రాజెక్టును పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం (పిహెచ్ఇడి) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతను సూత్రధర్ చేపట్టారు. ఈ విషయమై శాంతను “ది బెటర్ ఇండియా ” తో మాట్లాడుతూ ” ఇలా నిర్మించడం అంత కష్టమేమి కాదు. మేము వ్యర్ధాలుగా విసిరివేయబడ్డ ప్లాస్టిక్ సీసాలన్నింటినీ సేకరించి, వాటిని ఉపయోగించే ముందు వాటిని పూర్తిగా శుభ్రపరుస్తాము.
ప్రతి సీసాలో ఇసుక, సిమెంట్, పుట్టీ మరియు మోర్టార్ నిండి ఉంటుంది మరియు అవి గట్టిపడిన తర్వాత, మేము వాటిని ఇటుకలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తాము. సీసాలు తగినంత బలంగా అయిన తరువాతే వాటిని నిర్మాణం లో వినియోగిస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ బిల్డింగ్ ఫ్రేమ్ కోసం మామూలు స్థంభాలనే ఉపయోగించినప్పటికీ పైకప్పు, గోడలకు మాత్రం ప్లాస్టిక్ సీసాలను వాడినట్లు పేర్కొన్నారు.
“మొత్తం ప్రక్రియ పూర్తీ అవడానికి రెండు నెలల సమయం పట్టింది. మేము ఈ ప్రక్రియను హడావిడిగా చేయటానికి ఇష్టపడలేదు, అందువల్ల మాకు రెండు నెలల సమయం పట్టింది. ఇది ఇంకా వేగంగా చేయవచ్చు. ” అని శాంతను పేర్కొన్నారు. ఈ టాయిలెట్ లో వృద్ధుల సౌలభ్యం కోసం ర్యాంప్‌లు మరియు రెయిలింగ్‌లు కూడా ఉన్నాయి.
ఈ వేస్ట్ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించి మరో టాయిలెట్ ను అస్సాంలోని అభయపురి వద్ద ప్లాన్ చేస్తున్నారు, దీని తరువాత ప్రతి బ్లాక్ ప్రధాన కార్యాలయంలో అటువంటి వేస్ట్ ప్లాస్టిక్ సీసాల నుండి తయారైన టాయిలెట్ ఉంటుందని శాంతను చెప్పారు. టాయిలెట్ బయటి భాగం వేర్వేరు పదార్థాలతో తయారైనప్పటికీ, సంరక్షణ పరంగా, దీనికి అదనపు సంరక్షణ లేదా నిర్వహణ అవసరం లేదని శాంతను చెప్పారు.
ఈ ప్రాజెక్టు గురించి వివరించిన డిప్యూటీ కమిషనర్ ఐఎఎస్ డాక్టర్ లక్ష్మి ప్రియా “జిల్లాలో కార్బన్ ఎఫెక్ట్ ను తగ్గించడం కోసం మేము చేపట్టిన కార్యక్రమాలలో ఒకటి. ఇదే కాకుండా, మేము నగరమంతా 1,500 కంటే ఎక్కువ సోలార్ స్ట్రీట్ లైట్స్ ను ఏర్పాటు చేసాము. ఇప్పుడు మేము చాలా తక్కువ విద్యుత్ కాంతిని ఉపయోగిస్తున్నాము. ” అని పేర్కొన్నారు. ఇంకా, బొంగైగావ్ మునిసిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి మరియు వాటిలో వ్యర్థాల విభజన జరుగుతోంది. వీటిలో బయో డిగ్రేడబుల్ వ్యర్ధాలను ఎరువు గా వాడుతున్నాం. రీసైకిల్ చేయగలిగే వాటిని తిరిగి ఉపయోగిస్తున్నాం.
మరుగుదొడ్ల అవసరం ఎక్కువ ఉండడం తో.. వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ ను టాయిలెట్స్ గా నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసాము. బొంగైగావ్ దిగువ అస్సాం యొక్క ప్రధాన పట్టణం మరియు ఇది ఒక ప్రముఖ వ్యాపార, వాణిజ్య మరియు పారిశ్రామిక కేంద్రంగా ఉంది, తద్వారా రోజువారీ గణనీయమైన ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యర్ధాలను సేకరించి టాయిలెట్ నిర్మాణాలు చేపడుతున్నట్లు లక్ష్మి ప్రియా తెలిపారు.